
తెలంగాణ సంస్కృతి అంటే రాజప్రాసాదాలు, శిల్పకళ వైభవం మాత్రమే కాదు. అడవి తల్లి ఒడిలో, కొండగుట్టల నడుమ ప్రకృతితో మమేకమైన జీవన విధానమే అసలైన తెలంగాణ తత్వం. ఆ జీవన తత్వానికి అద్దం పట్టే మహోత్సవమే నాగోబా జాతర. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక కాదు. ప్రకృతి పూజగా, సామూహిక ఐక్యతకు ప్రతీకగా, తరతరాలుగా నిలిచిన సంప్రదాయ గౌరవంతో గిరిజన జీవన సంస్కృతిని ప్రతిబింబించే మహోత్సవంగా నాగోబా జాతర తెలంగాణ ఆత్మను ఆవిష్కరిస్తుంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నాగోబా జాతర గిరిజన సమాజానికి ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు.. ఆత్మగౌరవానికి ప్రతీక. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయం వద్ద జరిగే ఈ జాతరలో గోండులు, కొలాములు, నాయక్పోడ్లు, ప్రాధాన్లు సహా అనేక ఆదివాసీ తెగలు తమ సంప్రదాయాలను ఆచరిస్తారు. నాగోబా దేవతను సర్పరూప దైవంగా భావిస్తూ, ప్రకృతిని తల్లి రూపంలో పూజించే గిరిజన విశ్వాసం ఈ జాతరలో స్పష్టంగా దర్శనమిస్తుంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, గిరిజనులు, పరిశోధకులు, పర్యాటకులు ఈ జాతరకు తరలివస్తారు. ఇది ఒక జాతరగా మొదలై, కాలక్రమంలో జాతీయ స్థాయి గిరిజన సాంస్కృతిక ఉత్సవంగా ఎదిగింది.
అయితే ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ జాతర గతంలో మౌలిక సదుపాయాల కొరతతోనే కొనసాగింది. రహదారుల లేమి, వైద్య సౌకర్యాల లోపం, తాగునీటి సమస్యలు, భద్రతా ఏర్పాట్ల అసమర్థత భక్తులకు ఇబ్బందులు కలిగించాయి. ఈ పరిస్థితిని మార్చాలన్న స్పష్టమైన సంకల్పంతో ఈసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నాగోబా జాతరకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల విశ్వాసాన్ని పాలనా బాధ్యతగా భావిస్తూ, జాతరను రాష్ట్ర ప్రతిష్ఠకు ప్రతీకగా నిలపాలన్న దృక్పథంతో సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు ప్రణాళికలను రూపొందించి, భక్తుల సౌకర్యం కేంద్రంగా ఏర్పాట్లను చేపట్టింది. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక రహదారుల నిర్మాణం, విస్తృత పార్కింగ్ సదుపాయాలు, బస్సు రూట్ల పునర్వ్యవస్థీకరణ, ప్రత్యేక షటిల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెయ్యికిపైగా బస్సులతో షటిల్ సేవలు అందిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నాగోబా జాతరలో ఆరోగ్య సేవలు అత్యంత కీలకం. అందుకే ప్రభుత్వం 24 గంటల వైద్య శిబిరాలు, మొబైల్ హాస్పిటల్స్, 108 అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 500 మెడికల్ టీంలు, 50 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా సిద్ధమయ్యింది. తాగునీటి కోసం 1000 (వెయ్యి)కి పైగా ట్యాంకర్లు, వాటర్ పాయింట్లు ఏర్పాటు చేయడంతోపాటు పరిశుభ్రత కోసం 1,000 మంది పారిశుధ్య సిబ్బందిని నియమించింది.
ప్రజారోగ్యాన్ని కేంద్రంగా ఈ చర్యలు పాలనలో మారుతున్న దృక్పథానికి సంకేతంగా చూడాలి. భద్రతా ఏర్పాట్లలోనూ ప్రభుత్వం రాజీపడలేదు. 5 వేల మంది పోలీసులు, 2 వేల హోంగార్డులు, మహిళా పోలీస్ బృందాలు విధుల్లో పాల్గొంటున్నాయి. డ్రోన్ కెమెరాలు, 500 సిసిటివి కెమెరాలతో జనసందోహ నియంత్రణ, నిఘా పర్యవేక్షణ చేపట్టారు. అప్రమత్తత చర్యలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం గమనార్హం. నాగోబా జాతర గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక. అందుకే ఈ వేడుకను ప్రభుత్వం కేవలం పరిపాలనా కార్యక్రమంగా కాకుండా, సాంస్కృతిక ఉత్సవంగా చూడటం కీలకంగా భావించవచ్చు. గిరిజన కళాకారుల నృత్యాలు, వాద్యప్రదర్శనలు, సంప్రదాయ పూజా విధానాలను ప్రోత్సహిస్తూ వారి కళావారసత్వాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. 200కు పైగా గిరిజన స్వయం ఉపాధి సంఘాలకు స్టాళ్లు ఏర్పాటు చేసి ఆర్థికంగా బలపరచడం కూడా ఒక కీలక అడుగుగా గుర్తించాలి. నాగోబా జాతరను అంతర్జాతీయ స్థాయి పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలన్న దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పర్యాటక శాఖ ప్రత్యేక ప్రచారం, సమాచార కేంద్రాలు, డిజిటల్ గైడ్ సేవలు ఏర్పాటు చేసి సందర్శకులకు పూర్తి సమాచారం అందిస్తోంది. ఇది గిరిజన సంస్కృతిని కేవలం ప్రదర్శనగా కాకుండా, ప్రపంచానికి మన ఖ్యాతిని పరిచయం చేసే ప్రయత్నమని చెప్పుకోవచ్చు.
నాగోబా జాతరకు ప్రభుత్వం రూ. 5 కోట్ల నిధుల కేటాయించడంతో పాటు, ఈ జాతరను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు మంత్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ, గిరిజన నాయకులు -ఆలయ కమిటీలతో సమన్వయం వంటి వినూత్న చర్యలకు ప్రభుత్వం అనేక రకాలు బాధ్యతలు తీసుకుంది. ఇది ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈసారి చేపట్టిన ఏర్పాట్లు తాత్కాలిక అవసరాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ప్రతి ఏటా మెరుగైన జాతర నిర్వహణకు దోహదపడేలా శాశ్వత మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల విస్తరణ, పర్యాటక మౌలిక సదుపాయాల పెంపు వంటి దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగుతోంది. ఆదివాసీ సంప్రదాయాలను యునెస్కో స్థాయికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఈ ప్రయత్నాలకు దిశానిర్దేశం చేస్తోంది. మొత్తానికి నాగోబా జాతర తెలంగాణ గిరిజన జీవన సంస్కృతికి ప్రతిరూపం. ప్రజల విశ్వాసాన్ని పాలన పునాదిగా తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఈ పకడ్బందీ ఏర్పాట్లు.. ఒక ఉత్సవ నిర్వహణకే పరిమితం కావు. అవి తెలంగాణ ప్రజల జీవన విలువలకు, ఆదివాసీల సంస్కృతికి ఇచ్చిన గౌరవం. అందుకే ఈ నాగోబా జాతర.. ఇకపై, చరిత్రలో నిలిచే ప్రజల పండుగగా వర్ధిల్లనుంది.
అమరవాజీ నాగరాజు