
డిసెంబర్ 2025 చివరిలో డెహ్రాడూన్ ఆసుపత్రిలో త్రిపురకు చెందిన 24 ఏళ్ల ఎంబిఎ విద్యార్థి అంజెల్ చక్మా విషాద మరణం, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతా ల ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎదుర్కొంటున్న తీవ్రమైన పక్షపాతాన్ని మరోసారి బహిర్గతం చేసింది. చక్మాను, అతని తమ్ముడిని అవహేళన చేస్తూ చింకి, చైనీస్, మెమో వంటి జాతపరమైన దూషణలు చేసిన గుంపును ఎదుర్కొన్న తర్వాత చక్మాను దారుణంగా కత్తితో పొడిచారు. మానసికంగా, భౌతికంగా హింసించారు. చివరి క్షణంలోనూ చక్మా.. మేము చైనీయులం కాదు.. భారతీయులమే.. రక్షించండి అని వేడుకున్నాడు. నిరాశతో చివర్లో పలికిన అతడి మాటలు, ప్రధాన భూభాగానికి చెందిన నగరాల్లో విద్య, ఇతర అవసరాలకోసం తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లే అనేక మంది ఈశాన్య ప్రజలు ఎదుర్కొంటున్న పరాయభావనను బయటపెట్టాయి. 2025 డిసెంబర్ 9న జరిగిన ఈ సంఘటన తర్వాత వారాల తరబడి ఆసుపత్రిలో ఇబ్బంది పడి చివరికి చక్మా మరణించాడు. ఇదే తొలి సంఘటన కాదు. ఈ బాధాకరమైన సంఘటన గతంలో ఈ జ్ఞాపకాలను తిరిగి గుర్తుచేస్తున్నది. ముఖ్యంగా 2014లో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల విద్యార్థి నిడో తానియా హత్య. ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్ మార్కెట్‌లో తన రూపాన్ని ఎగతాళి చేయడంతో, అభ్యంతరం వ్యక్తం చేసి ఎదిరించినందుకు అతన్ని కొట్టి చంపారు. తానియా మరణం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.
మెట్రోపాలిటన్ ప్రాంతాలలో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న ఆందోళనలను పరిశీలించడానికి, ఈశాన్య మండలి మాడీ సభ్యుడు, ఎంపి బెజ్బురువా అధ్యక్షతన బెజ్బురువా కమిటీని ఏర్పాటు కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2014లో సమర్పించిన నివేదిక భయంకరమైన చిత్రాన్ని ఆవిష్కరించింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిలో 80% కంటే ఎక్కువ మంది ప్రజలు వివక్షను ఎదుర్కొంటున్నట్లు కమిటీ నివేదించారు. ముఖ్యంగా సూటిపోటి మాటలు. ఇళ్లు అద్దె ఇవ్వడానికి నిరాకరించడంతోపాటు, వారిపై శారీరక దాడులు కూడా జరుగుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. ముఖ కవళికలు, లక్షణాలే ఇందుకు ప్రధాన కారణం. ఈశాన్యవాసులు వారి మంగోలాయిడ్ లక్షణాల కారణంగా వారిని విదేశీయులుగా ముద్రవేయడం ప్రధాన కారణం. విచారణ కమిటీ పలు ముఖ్యమైన సిఫార్సులు చేసింది.
వాటిలో జాతి వివక్షను ప్రత్యేక నేరంగా గుర్తించడానికి భారతీయ శిక్షాసృ్మతికి సవరణలు చేయడం, అటువంటి కేసులకు ప్రత్యేక పోలీసు యూని ట్లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం, చట్టం అమలుకు తప్పనిసరిగా నిర్దిష్టమైన శిక్షణ ఇవ్వడం వంటివి ఉన్నాయి. అలాగే, ఈశాన్య రాష్ట్రాల చరిత్ర, సంసృ్కతిని స్కూల్ స్థాయిలో పాఠ్యాంశాలలో చేర్చడం, వలసదారులకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు తోపాటు భరోసా కల్పించడంవంటి సమగ్రమైన సిఫార్సులు ఉన్నాయి. ఈ కమిటీ సిఫార్సులు చేసి దశాబ్దం కంటే ఎక్కువ కాలం గడిచినా, ఈ సూచనల అమలు చాలా దారుణంగా ఉన్నాయి. పార్లమెంటులో ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, కోర్టులలో కేసుల పురోగతిలో మందకొడితనం వీటిని హైలైట్ చేసింది. ఉదాహరణకు 2018 లో సుప్రీంకోర్టు బెంచ్ ఫాలో- అప్ కమిటీలు అరుదుగా జరిగే సమావేశాలలో అసంతృప్తి వ్యక్తం చేసింది. జాతి విద్వేషపూరితమైన నేరాలకు గట్టిగా పరిష్కరించడానికి చేసిన అనేక సిఫార్సులు, చట్టపరమైన సూచనలు బుట్టదాఖలయ్యాయి. చక్మా కేసుపై పోలీసు విచారణ లో కనబరచిన ప్రతిస్పందన సంస్థాగత నిర్లక్ష్యానికి అద్దం పట్టింది.
ప్రత్యక్ష సాక్షుల కథనాలు ఎఫ్‌ఐఆర్‌లో తిట్లను ప్రస్తావించినా, ఉత్తరాఖండ్ అధికారులు ఈ దాడిని చాలా తేలిగ్గా తీసుకున్నారు. పొరపాటున జరిగిన ఘర్షణ అని, హాస్యం కోసం చేసిన వ్యాఖ్యలుగా పేర్కొని, జాతిపరమైన వివక్షను తక్కువగా అంచనా వేశారు. ఇటువంటి నిర్లక్ష్యం వల్ల న్యాయం ఆలస్యం కావడమేకాక, జాతిహింసను సాధారణ అంశంగా చిత్రీకరించి వ్యవస్థాగత మూలాలను తుడిచిపెట్టే సంసృ్కతిని శాశ్వతం చేస్తుంది. ఈ కేసు తర్వాత ఉదాసీనత మరింత పెచ్చుపెరిగింది. కొవిడ్ -19 మహమ్మారి సమయంలో ఈశాన్య ప్రాంతాల వారు మరింత వివక్ష ఎదుర్కొన్నారు. కరోనా వైరస్ క్యారియర్లు లేదా చైనీస్ అని పిలిచేవారు. దీని ఫలితంగా ఢిల్లీ, ముంబై, పుణే వంటి నగరాలలో ఈశాన్య ప్రాంతాల వారి బహిష్కరణలు, చూస్తూ ఉమ్మివేయడం, దాడులు వంటివి జరిగాయి. ప్రభుత్వం నియమించిన అధ్యయనం పెరిగిన పక్షపాత ధోరణిని నిర్ధారించింది. భౌతికమైన రూపం నే ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
అసోంలో జాతి ఘర్షణల తర్వాత దాడుల పుకార్ల నేపథ్యంలో 2012 లో బెంగళూరు నుంచి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వలసవెళ్లడం వంటి సంఘటనలు వారి బలహీనతలను నొక్కి చెప్పారు. 2025 నుంచి వచ్చిన వివేదికలు కొనసాగుతున్న వేధింపునలు హైలైట్ చేస్తున్నాయి. విద్యా కేంద్రాలలో విద్యార్థులు అవమానాలు ఎదుర్కొనగా, ఇళ్లను అద్దెకు ఇవ్వకపోవడం, నిపుణుల విషయంలోనూ, బహిరంగ ప్రదేశాలలో మతతత్వం కూడా పెరిగింది. ఈ జాత్యాహంకార ధోరణులు భారత రాజ్యాంగ ఆత్మను దెబ్బతీస్తున్నాయి. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే అని హామీ ఇచ్చినా, ఆర్టికల్ 15 జాతి ఆధారత వివక్షను నిషేధిస్తుంది. అయినా, ఈశాన్య భారతంలోని 8 రాష్ట్రాలలో నాలుగున్నర కోట్ల ప్రజలు, ప్రత్యేక చరిత్ర, భాష, సంసృ్కతులు గల పౌరులు తమకు సమాన పౌరసత్వం ఓ భ్రమగానే భావిస్తున్నారు.
ఈశాన్య ప్రాంతాలవారు దేశంలో అంతర్భాగం. సాయుధదళాలకు అసమానంగా తోడ్పడడం, నాగ పండుగల నుంచి మణిపురి నృత్యం వరకూ సాంప్రదాయాలతో కూడిన సాంసృ్కతిక, వస్త్రాలను సుసంపన్నం చేయడం వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలలో సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, వారి దుస్థితిని పట్టించుకోకపోవడం, జనాభాలోని కీలక విభాగాన్ని దూరం చేస్తున్నది. జాతీయ ఐక్యతను బలహీనపరుస్తుంది. ఈశాన్య సంక్లిష్టతపై భారతదేశంలోని ప్రధాన ప్రాంతాల ప్రజలలో అవగాహన లేకపోవడం వల్ల ఈ పక్షపాతం మరింత తీవ్రమవుతోంది. ఈశాన్య ప్రాంతం వాస్తవానికి 200 కంటే ఎక్కువ జాతి సమూహాల సముదాయం, వలసపాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటన చరిత్రలు, స్వాతంత్య్ర పోరాటాలకు తోడ్పడిన చరిత్రలు ఉన్నాయి. దూషణలు హింసగా మారే వాతావరణాన్ని పెంచుతాయి.
సోషల్ మీడియా మరీ ఎక్కువగా జాత్యహంకారాన్ని పెంచుతోంది. ఇలాంటి సంఘటనలు విచ్చలవిడిగా పరిగణిస్తాయి. చక్మా మరణం తర్వాత సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం, జాతి దూషణలను ద్వేషపూరిత నేరంగా పరిగణించాలని, బెజ్బురువా సిఫార్సులను పునరుద్ధరించాలని ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోరింది. త్రిపుర, ఢిల్లీ, ఇతర నగరాలలో కొవ్వొత్తుల వెలుగు ప్రదర్శనలు న్యాయం కోరుతూ, సంస్థాగత మార్పును డిమాండ్ చేశాయి. హత్య ఒకటే కాదు అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, నాగాలాండ్ కు చెందిన టెంజెన్ ఇమ్నా అలాంగ్ వంటి రాజకీయనాయకులతో ఈశాన్య ప్రాంతాలనుంచి వినిపించిన స్వరాలు బలమైన రక్షణల కోసం పిలుపు నిచ్చాయి.
భారతదేశం మరో విషాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదు. ఆ అవకాశం కల్పించకూడదు. ముందు ప్రభుత్వం నిర్దిష్ట జాత్యహంకార వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాలి. జాతి వివక్షను ఘోరమైన నేరంగా పరిగణించడానికి ఐపిసిని, చట్టాన్ని సవరించాలి. ప్రధాన నగరాలలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, ప్రత్యేక పోలీసు సెల్ ఏర్పాటు చేసి, శిక్షణ పొందిన అధికారులను నియమించి సత్వర న్యాయం కల్పించడం అవసరం. విద్యా సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. ఈశాన్య రాష్ట్రాల చరిత్రకు సంబంధించిన అధ్యాయాలను జాతీయ పాఠ్యపుస్తకాలలో చేర్చడం వల్ల చిన్నతనం నుంచే చక్కటి అవగాహన పెరుగుతుంది. రెండవది. సాంసృ్కతిక మార్పిడి కార్యక్రమాలు, ఈశాన్య కళలను ప్రదర్శించే ఉత్సవాలు ఆ ప్రాంత ప్రజల పట్ల అవగాహన పెంచగలవు. మూడోది. వలసదారులకు భద్రత, మద్దతు వ్యవస్థలను బలోపేతం చేయాలి.
హెల్ప్‌లైన్‌లను యాక్టివేట్ చేసి, సురక్షిత గృహాలు కల్పించడంతోపాటు వివక్షకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. చివరిగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఈశాన్యప్రాంత అభివృద్ధి కింద ప్రత్యేక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి ఈ సంఘటనలను పర్యవేక్షించేటట్లు చూడాలి, జవాబుదారీతనాన్ని నిర్ధారించాలి. చివరగా సభ్యసమాజం ప్రధాన బాధ్యత వహిస్తుంది. రాజకీయ నాయకులు జాత్యహంకారాన్ని స్పష్టంగా ఖండించాలి. పౌరసమాజం, విద్యాసంస్థలు, ప్రగతి శీలురైన పౌరులు తమ ప్రసంగాలలో ఈ దూషణ ధోరణులను బహిరంగంగా ఖండించాలి. భారతదేశం సమష్టి ఆత్మపరిశీలన ద్వారా మాత్రమే ఈ జాత్యహంకార వివక్షలు పరిష్కారం కాగలవు. చక్మా చనిపోతూ చెప్పిన మాటలు హృదయ విదారకమైన నేరారోపణగా, స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పిలుపునిస్తాయి. చక్మా మరణం నుంచి తానియా వరకూ లెక్కలేనన్ని రికార్డులకు ఎక్కని బాధితుల మరణాలు తొలగిపోవాలంటే, జాత్యహంకారాన్ని తీవ్ర నేరంగా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి పౌరుడు, అతడి రూపంతో సంబంధం లేకుండా నిస్సందేహంగా భారతీయుడే అన్న విధానం అమలు కావాలి. ఈ విధానం ఆచరణ నైతిక ఆవశ్యకత మాత్రమే కాదు. అందరినీ కలుపుకోవడం చాలా అవసరం. తిరస్కరణలకు కాలం చెల్లింది. మార్పునకు సమయం ఆసన్నమైంది.
గీతార్థ పాఠక్