
ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీలు తాము విజయం సాధిస్తే ఏయే ప్రణాళికలు అమలు చేస్తామో హామీలిస్తూ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం సర్వసాధారణ విషయం. కానీ కొందరు ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, ఆ విధంగా ఓట్లను కొల్లగొట్టడానికి తాపత్రయ పడుతుంటారు. ఏదో ఒక సాకుతో ప్రత్యర్థులపై ప్రజల్లో అపనమ్మకం కలిగించి కుట్రలు పన్నడం కొన్ని పార్టీల్లో ఇటీవల కొత్త వరవడి కనిపిస్తోంది. మతపరమైన అజెండాలను ముందుకు తీసుకెళ్తూ తమ పార్టీని బలోపేతం చేస్తూ అధికారం చేజిక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు కమలనాథులకు కొత్తేమీ కావు. ఇటువంటి వ్యూహాలను రూపొందించడంలో మొదటి నుంచీ వారు పరిపూర్ణత సాధిస్తూ విజయ పతాకాన్ని ఎగుర వేస్తున్నారు. కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రధాని మోడీ మమ్మురంగా ప్రచారం సాగిస్తున్నారు.
2047 నాటికి దేశం అభివృద్ధి సాధించాలంటే బెంగాల్ భవిష్య విజన్‌తోనే ముడిపడి ఉందని, బెంగాల్‌కు అసలైన సవాల్ చొరబాట్లేనని, వీటిని అరికట్టడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రధాని మోడీ తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టారు. చొరబాట్ల కారణంగానే మాల్దా, ముర్షీదాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయని ధ్వజమెత్తారు. అంతేకాదు చొరబాట్ల ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల జనాభా వర్గీకరణలో మార్పు వచ్చిందని తేల్చిచెప్పారు. మొత్తం మీద ఆ రాష్ట్రం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి స్వర్గథామంగా మారిందని చిత్రీకరిస్తున్నారు. ఈ వలసలకు అనేక కారణాలు, ముఖ్యంగా ఆర్థిక అవసరాలే అని అందరికీ తెలిసిందే. సరిహద్దుల్లోని వలసలను అరికట్టే బాధ్యత రాష్ట్రానిదా, కేంద్రానిదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దేశ సరిహద్దులను రక్షించే భారీ వ్యవస్థకు అత్యున్నత స్థానంలో ప్రధాన మంత్రి ఉంటారు.
ఇందులో రాష్ట్ర నాయకత్వం పాత్ర చాలా స్వల్పం. అయినా చొరబాట్లను అరికట్టడం పూర్తి బాధ్యత పశ్చిమబెంగాల్ తృణమూల్ ప్రభుత్వానికే అన్నట్టు వాస్తవాలకు భిన్నంగా ప్రధాని మోడీ పదేపదే ఊదరగొడుతుండటం విచిత్రం. బంగ్లాదేశ్ సరిహద్దుతో ఉన్న మనదేశ సరిహద్దును రక్షించే బాధ్యత బిఎస్‌ఎఫ్ బలగాలదే. ఆ బలగాలకు ఆదేశాలు జారీ చేయాల్సింది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ప్రధాని మార్గదర్శకాలను అనుసరించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ బిఎస్‌ఎఫ్ బలగాలపై అజమాయిషీ చేస్తుంది. ఇంత నెట్‌వర్క్ అల్లుకుని ఉన్నప్పుడు సరిహద్దుల్లో చొరబాట్ల నివారణలో వైఫల్యాలు ఎవరికి వర్తిస్తాయో వేరే చెప్పనక్కరలేదు. ప్రధాని మోడీ చొరబాట్ల గురించి చేస్తున్న వాదనలు, వ్యాఖ్యలు విశ్వసనీయత కలిగి ఉండాలంటే, ముందుగా చొరబాట్లను అడ్డుకుని, అక్రమ చొరబాటుదార్లను గుర్తించి, చట్టపరంగా శిక్షించడం, లేదా వారిని వెనక్కు పంపించడం ఇవన్నీ ప్రధాని యంత్రాంగమే చేయాల్సి ఉందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అలా చర్యలు చేపడితే ఎవరూ అడ్డు చెప్పరు కూడా. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ప్రయోజనం ఏమిటి? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ఒక బూటకంగా మోడీ వర్గం వాడుకుంటున్నారని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
ఈ సందర్భంగా మోడీ ఒక ప్రమాదకరమైన అంశాన్ని లేవనెత్తారు. బిజెపి అధికారంలోకి రాగానే పశ్చిమబెంగాల్‌లో చొరబాట్లను పాశ్చాత్య దేశాల మాదిరిగా తక్షణం అరికడతామని హామీ ఇచ్చారు. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసవాదులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారో అటువంటి చర్యలు తీసుకుంటామన్న ఆలోచన కలిగించారు. అమెరికా విధానం ఇక్కడ కూడా అమలులోకి తెస్తే ప్రమాదకరమైన పరిణామంగా మారుతుంది. అమెరికాలో సరైన డాక్యుమెంట్లు లేని వలసవాదులను ఎన్ని విధాలా చిత్రహింసలు పెడుతున్నారో తెలిసిందే. అమెరికా లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు, కస్టమ్స్ అధికారులు అక్రమవలస వాదులని ఎవరినైనా గుర్తిస్తే వారిలో కొందరు ప్రాణాంతక యాతన కూడా ఎదుర్కోవలసి వస్తోంది. అమెరికాలో స్థిరంగా ఉంటున్న అమెరికా ఇండియన్లు కూడా తమ చట్టబద్ధతను నిరూపించుకోలేక వివాదాస్పద పరిస్థితులతో సతమతమవుతుండడం ట్రంప్ డ్రైవ్ ఫలితమే. అమెరికా ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే ప్రతి విలువను ఇమ్మిగ్రేషన్ లేదా ఇతర నిఘా అధికారులు తిరస్కరించడం దీనిపై అమెరికాలో ఎంత దుమారం రేగుతోందో తెలిసిందే. అటువంటి ప్రభుత్వ దురహంకార పరిణామాలను భారత దేశం ఊహించడం లేదు.
మరో ముఖ్య విషయం చొరబాట్ల వల్ల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జనాభా వర్గీకరణలో మార్పు వచ్చిందని, ప్రజల రూపురేఖల్లోను, అలవాట్ల లోను, మార్పు వచ్చిందని, భాషల్లో తేడాలు, స్వరాల్లో అపసవ్యాలు వచ్చాయని మోడీ ఆరోపిస్తున్నారు. ఇవన్నీ రెచ్చగొట్టే మాటల తప్ప మరేం కావు. పైగా యువతరం తమ వెనకే ఉన్నట్టు జెన్ జీ బిజెపి అభివృద్ధి నమూనాను విశ్వసిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కొన్ని వర్గాల ప్రజలను అనుమానపు మబ్బుల్లో ఉంచడానికి ప్రయత్నించడం, ఒక సమాజానికి చెందిన పౌరులను, మరో సమాజానికి చెందిన పౌరులకు వ్యతిరేకంగా ప్రేరేపించడం ఎప్పటికీ, ఎవ్వరికీ ఆమోద యోగ్యం కాదు. వాస్తవాలను వక్రీకరించడం, చరిత్రను తారుమారు చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే అవుతుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే అభివృద్ధి నమూనా అని చాటుకుంటున్నారు. అలా ప్రతి రాష్ట్రంలో తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండాలన్నది బిజెపి ఆకాంక్ష.