Reading Time: 2 minutes

మన తెలంగాణ/చింతకాని: రాష్ట్రంలో పేదలు, రైతుల కోసం గడిచిన రెండేళ్లలో రూ. 1.21లక్షల కోట్లను ఖర్చు చేశామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. వ్యవసాయ రంగంపై గత 2 సంవత్సరాల కాలంలో ప్రజా ప్రభుత్వం 74 వేల 163 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. మ హిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత ఫించన్, వడ్డీ లేని రుణాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహ జ్యోతి, సన్న బియ్యం వంటి వివిధ సంక్షే మ పథకాలకు 47 వేల 710 కోట్ల రూపాయ లు ఖర్చు చేశామన్నారు. ఖమ్మం జిల్లాలో లక్షా 98వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాధనకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సోమవారం చింతకాని మండలం వందనం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. 2,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అం దించేందుకు

35 కోట్ల 75 లక్షలతో చేపట్టిన కొదుమూరు – వందనం ఎత్తిపోతల రెండో విడత పనులకు, వందనం గ్రామం లో ఎస్సీ కాలనీలో కోటి 85 లక్షలతో చేపట్టిన అంతర్గత సిసి రోడ్ల పనులకు, ఆర్ అండ్ బీ రోడ్డునుంచి వందనం పుట్టకోట జెడ్పీ రోడ్డు వరకు 3 కోట్ల 50 లక్షలతో చేపట్టనున్న బీటి రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. కొదుమూరు – వందనం లిఫ్ట్ పనులు గతంలో పూర్తి చేసి 2,500 ఎకరాలకు 2013 ప్రాంతంలో సాగు నీరు అందించామని గుర్తు చేశారు. చింతకాని మండలం చుట్టూ నాగార్జున సాగర్ నీళ్లు ఉన్నప్పటికి కొదుమూరు, వందనం రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడ్డారని, వీరి ఆవేదన పరిశీలించి 2009లో ఇచ్చిన మాట ప్రకారం అప్పట్లో మొదటి విడత లిఫ్ట్ పూర్తి చేశామన్నారు. కొదుమూరు వందనం లిఫ్ట్ కారణంగా ఎండాకాలంలో కూడా నీరు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరో 2,500 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కొదుమూరు వందనం లిఫ్ట్ రెండవ ఫేజ్‌కు శ్రీకారం చుట్టామన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట గత పాలకులు పేద ప్రజలను మోసం చేశారని, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పాద యాత్రలో ప్రతి గ్రామంలో ప్రజలు ఇళ్ల కోసం తాపత్రయం పడటం గమనించి అధికారంలోకి రాగానే 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను 22 వేల 500 కోట్ల రూపాయలతో మంజూరు చేసామని వివరించారు. జిల్లాలో 2 లక్షల 79 వేల ఎకరాల ఆయకట్టు ఉమ్మడి రాష్ట్రంలో కల్పించామని అన్నారు. ప్రజా ప్రభుత్వం నేడు మరో లక్షా 98 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాధించేందుకు ప్రణాళికలు తయారు చేశామని అన్నారు. మున్నేరు పాలేరు లింకు కెనాల్ ద్వారా లక్షా 38 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, జవహర్ లిఫ్ట్ క్రింద 33 వేల 25 ఎకరాలు, రాజీవ్ ఫీడర్ కెనాల్ ద్వారా 23 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొదుమూరు వందనం లిఫ్ట్ ద్వారా 2,500 ఎకరాలు, మంచుకొండ లిఫ్ట్ ద్వారా 2,412 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించే పనులు చేపట్టామని అన్నారు. నేడు రైతులకు మేలు చేసేందుకు మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు, వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, సన్న వడ్లకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్, రైతు భరోసా, రైతు బీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

వ్యవసాయ రంగంపై గత 2 సంవత్సరాల కాలంలో ప్రజా ప్రభుత్వం 74 వేల 163 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని అన్నారు. గ్రామీణ ప్రజల స్థితిగతులు మెరుగవ్వాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 5 వేల కోట్ల రూపాయలు వడ్డి లేని రుణాలు ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఇందిరమ్మ చీరలను ప్రత్యేకంగా డిజైన్ చేయించి ఇంటింటికీ పంపిణీ చేశామని అన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ… రూ.35 కోట్ల వ్యయంతో కొదుమూరు – వందనం ఎత్తిపోతల రెండో విడత పనులకు నేడు శంకుస్థాపన చేసుకున్నామని, ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల 2,500 ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్త కళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఇరిగేషన్ ఈఎన్సీ రమేష్, ఇరిగేషన్ ఎస్‌ఈ ఎం వెంకటేశ్వర్లు, మత్కేపల్లి ఏఎంసి చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, సిపిఓ ఏ శ్రీనివాస్, పిఆర్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి నవీన్ బాబు, జిల్లా మైనారిటీ అధికారి ముజాహిద్, వందనం సర్పంచ్ ఆవుల నాగేశ్వర రావు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.