Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ల్యాబ్ టెక్నిషీయన్ గ్రేడ్ 2 కౌన్సెలింగ్, పోస్టింగ్‌లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అం దాయి. వారం రోజుల క్రితం ల్యాబ్ టెక్నిషీయన్ గ్రేడ్ 2 కింద 1,257 మందికి ఉద్యోగాలు లభించగా అందులో 100ల మందికి అన్యాయం జరిగిందని, పోస్టింగ్‌ల్లో భారీగా ముడుపులు చేతు లు మారాయని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమకు పోస్టింగ్‌లో అన్యాయం చేశారని ప్రోసీడింగ్స్ ఉత్తర్వులను అందుకున్న అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

1,284 పోస్టులు.. 20వేల దరఖాస్తులు

జోన్ 1 నుంచి జోన్ 7 వరకు ఖాళీగా ఉన్న 1,284 పోస్టులకు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి (మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు) ప్ర భుత్వ జిఓ ప్రకారం పరీక్ష నిర్వహించి ఖాళీల ను భర్తీ చేసింది. ఈ పోస్టుల కోసం సుమారుగా 20 వేల పైచిలుకు దరఖాస్తులు రాగా, ఇందులో 1,257 పోస్టులకు మాత్రమే ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి భర్తీ చేసింది. మిగతా ఖాళీలను కోర్టు కేసుల వల్ల ఆపివేశారు. ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి అభ్యర్థులకు పరీ క్ష నిర్వహించగా, అనంతరం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ను గత సంవత్సరం డిసెంబర్‌లో నిర్వహించా రు. ఈ కౌన్సెలింగ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డైరెక్టర్), జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆఫీస్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, మరికొంతమంది అధికారుల ఆధ్వర్యంలో జరిగింది.

అయితే, పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించిన సమయంలో ఆయా అభ్యర్థుల మెరిట్ జాబితా ఆధారంగా వారిని ఇంటర్వూలకు పిలిచి ఖాళీగా ఉన్న పోస్టుల వివరాల ను అధికారులు అభ్యర్థుల ముందుంచారు. అ భ్యర్థులు ఎంపిక చేసుకున్న స్థానాలను టిక్ చేసి తరువాత వచ్చే అభ్యర్థులకు అవి భర్తీ అయినట్టుగా అధికారులు చూపించారు. ఇలా, జోన్ 1 నుంచి జోన్ 7 వరకు ఇదే పద్ధతిని అధికారులు అనుసరించారు. అయితే, ఇంతవరకు నిబంధన ల ప్రకారం నడుచుకున్న అధికారులు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్‌ను ఇచ్చినప్పుడు మాత్రం అభ్యర్థులు ఎంపిక చేసుకున్న స్థానం కాకుండా వేరే స్థానాలను వారికి అలాట్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థులు 

ఉద్యోగంలో జాయిన్ కావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయమై ల్యాబ్ టెక్నిషీయన్ గ్రేడ్ 2గా ఎంపికైన అభ్యర్థులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను వచ్చి నిలదీయగా కొన్ని తప్పిదాల వల్ల ఇలా జరిగిందని, తాము ఇచ్చిన స్థానాల్లో చేరాలని అధికారులు నిర్లక్షంగా సమాధానం చెబుతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు తాము ఎంపిక చేసుకున్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో తాము ఎలా ఉద్యోగం చేయాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక, వారు ఉద్యోగంలో చేరలేక కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ డైరక్టర్‌రేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడం విశేషం.

జోన్ 5,6లో భారీగా అవకతవకలు

అయితే, కౌన్సెలింగ్‌లో కొందరు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ముఖ్యమైన స్థానాలను కొందరు అధికారులు ముడుపులు తీసుకొని వేరే వారికి కేటాయించారని, సుమారుగా 100 మందికి ఇలా అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జోన్ 5లోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగాం జిల్లాలు ఉండగా, జోన్6లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఈ అవకతవకలు అధికంగా జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై రెండు, మూడు రోజులుగా అభ్యర్థులకు, అధికారులకు మధ్య గొడవలు జరుగుతుండడం విశేషం. తమ ఆర్డర్‌ను మార్చాలని అభ్యర్థులు చేస్తున్న విజ్ఞప్తిపై అధికారులు చేతులెత్తేసినట్టుగా తెలిసింది. ముడుపులు తీసుకొని తమకు అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. ఇప్పటికైనా తాము కౌన్సెలింగ్‌లో పూర్తి చేసిన ఫాంలను తెప్పించి వాటిని పరిశీలించి సంబంధిత అధికారులపై విచారణ జరపాలని ప్రభుత్వానికి అభ్యర్థులు విన్నవించినట్టుగా తెలిసింది.