
అమెరికా గ్రీన్‌లాండ్ సుంకాల నేపథ్యంలో ఐరోపా దేశాల యోచన
గ్రీన్‌లాండ్ ఆక్రమణకు ఇదే మంచి సమయం అని ట్రంప్ ప్రకటన
8యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ ప్రకటించనప్పుడు ఇక శాంతి గురించి ఎందుకు ఆలోచించాలని ప్రశ్న
లండన్ : గ్రీన్‌లాండ్ టారిఫ్‌ల పేరుతో తమపై 10శాతం అదనంగా పన్నుల భారాన్ని మోపేందుకు సన్నాహాలు చేసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అదే రీతిలో సమాధానం చెప్పేందుకు యురోపియన్ యూనియన్ దేశాలు సంసిద్ధమవుతున్నాయి. తమ చేతిలో ఉన్న ‘ట్రేడ్ బజూక’ అనే వాణిజ్య ఆయుధాన్ని వాడాలని యోచిస్తున్నాయి. ట్రంప్ సుంకాలను ఇప్పటికే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ ప్రధాని మేక్రాన్ సహా పలు ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రతినిధులు బస్సెల్స్‌లో అత్యవసర భేటీ జరిపారు.
ఐరోపాయేతర దేశాల నుంచి వాణిజ్యపరమైన సవాళ్లు ఎదురైనప్పుడు కౌంటర్ టారిఫ్‌ల విధానాన్ని ఈయూ దేశాలు ప్రయోగిస్తాయి. ఈయూ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ వ్యవస్థకు రూపకల్పన చేశారు. దీన్నే ట్రేడ్ బజూకగా వ్యవహరిస్తారు. దీన్ని ప్రయోగిస్తే.. ఈయూ దేశాలన్నింటిలో వస్తు సేవల విక్రయానికి అమెరికాకు ఉన్న అవకాశాలు సన్నగిల్లుతాయి. ఆంక్షల కారణంగా వస్తు సేవల విక్రయం పరిమితులకు లోనవుతుంది. తద్వారా అమెరికన్ కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఇదిలా ఉండగా ట్రంప్ టారిఫ్‌ల హెచ్చరికపై బ్రిటన్ ప్రధాని మరోసారి స్పందించారు. వాణిజ్య యుద్ధం ఎవరికీ ప్రయోజనకరం కాదని, గ్రీన్‌లాండ్ టారిఫ్ విధానంగా పూర్తిగా తప్పుడు నిర్ణయమని ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
గ్రీన్‌లాండ్ ఆక్రమణకు ఇదే మంచి సమయం: ట్రంప్
గ్రీన్‌లాండ్ ఆక్రమణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. వ్యూహాత్మక ప్రాంతమైన గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవడానికి తమకు ఇంతకన్నా మంచి సమయం లేదని అన్నారు. చైనా, రష్యాల్లో ఎవరో ఒకరు ఆ పని చేయకముందే తాము చర్యలు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రీన్‌లాండ్‌కు ముంపు పొంచి ఉందని నాటో 20 ఏళ్లుగా హెచ్చరిస్తున్నా డెన్మార్క్ దాన్ని పెడచెవిన పెడుతూ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో నార్వే ప్రధాని జోనాస్‌కు ట్రంప్ లేఖ రాశారు. 8 యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ బహుమతి ప్రకటించలేదని, ఇకపై ప్రపంచంలో శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం తనకు లేదన్నారు. అమెరికాకు ఏది లాభమో దాన్నే తాను ఆచరిస్తానని నార్వేకు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు.