Reading Time: < 1 minute

కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ అధికారి, డిజిపి కె. రామచంద్రరావు కు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ రోజు సోషల్ మీడియాలో డిజిపి రామచంద్రరావుకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రత్యక్షమయ్యాయి.ఈ వీడియోలు ఆయన అధికారిక కార్యాలయంలోనే  తీసినట్లుగా కనిపిస్తున్నాయి. పోలీస్ యూనిఫాంలో విధుల్లో ఉండగానే తన గదికి వచ్చిన మహిళలతో ఆయన అత్యంత సన్నిహితంగా (ముద్దులు, కౌగిలింతలు) ప్రవర్తించినట్లు వీడియోల్లో ఉన్నాయి. వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు మహిళలతో ఈ తరహా ప్రవర్తన కెమెరాలకు చిక్కినట్లు తెలుస్తోంది.కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ చట్టానికి అతీతులు కారని, ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడం క్షమించరానిది అని పేర్కొంటూ విచారణకు ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డిజిపి రామచంద్రరావు తనపై వస్తున్న వార్తలను ఖండించారు.ఆ వీడియోలు ‘మార్ఫింగ్’ చేసినవని, తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎవరో కుట్ర పన్నారని ఆయన వాదించారు.