
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ని చేజార్చుకుంది భారత్. అయితే ఈ మ్యాచ్ లక్ష్య చేధనలో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. అతడికి హర్షిత్ రాణా అందించిన సహకారం మామూలుది కాదు. హర్షిత్, కోహ్లీలు కలిసి దాదాపు 100 పరుగుల భాగస్వామ్యం జత చేశారు. ఈ నేపథ్యంలో హర్షిత్ అర్థ శతకం కూడా సాధించాడు. దీంతో హర్షిత్ పోరాట పటిమపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒకప్పుడు హర్షిత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా కోహ్లీని పొగడటంతో పాటు.. హర్షిత్‌ని కూడా ఆకాశానికెత్తారు.
‘‘విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా ఒత్తిడికి గురికాలేదు. నితీశ్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో బ్యాట్ ఝుళిపించాడు. కానీ, రియల్ గేమ్ ఛేంజర్ హర్షిత్ రాణా. అతను బ్యాటింగ్ చేసిన తీరును చూసి న్యూజిలాండ్ ప్లేయర్లు వణికిపోయారు. హర్షిత్ బ్యాటింగ్ చూసి నేనూ ఆశ్చర్యపోయాను. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం అద్భుతం. అలవోకగా సిక్సులు కొట్టడంతో ప్రత్యర్థి జట్టుకు ఏం చేయాలో తోచలేదు. హర్షిత్ హిట్టింగ్ న్యూజిలాండ్ ప్లేయర్లలో భయాన్ని కలిగించింది’’ అని శ్రీకాంత్ అన్నారు.