Reading Time: < 1 minute

బిజెపి జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారంనాడు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. నబీన్ ఒక్కరి తరపున మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయనకు పోటీగా మరెవరూ నామినేషన్‌కు ముందుకు రాలేదు. నబీన్‌ను మద్దతుగా 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని, అన్నీ కూడా సవ్యంగా ఉన్నాయని పార్టీ అధ్యక్ష ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న తెలంగాణకు చెందిన బిజెపి సీనియర్ నేత కె.లక్ష్మణ్ వెల్లడించారు. మధ్యాహ్న 2గంటల నుంచి 4గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. నబీన్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు సీనియర్ నాయకులు జెపి నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇప్పటి వరకు నబీన్ తరపున మాత్రమే నామినేషన్ దాఖలైందని, పరిశీలన తర్వాత అన్నీ సక్రమంగానే ఉన్నట్లు నిర్ధారించినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల నియామకం ప్రక్రియ పూర్తయిన తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను మొదలు పెట్టినట్లు ఆయన తెలిపారు. మొత్తం రాష్ట్రాల్లో 50శాతం రాష్ట్రాలు ఎన్నికకు చొరవ చూపితే బిజెపి జాతీయ అధ్యక్షుడి ఎంపిక విధానాన్ని ప్రారంభించడం పార్టీ నిబంధనగా ఆయన తెలిపారు. 37 సెట్ల నామినేషన్లలో 36 ఆయా రాష్ట్రాల నుంచి దాఖలు కాగా, మరొకటి బిజెపి పార్లమెంటరీ బోర్డు నబీన్‌ను ప్రతిపాదిస్తూ నామినేషన్ దాఖలు చేసిందని, దానిపై ప్రధానితో పాటు 37మంది ఎంపిల సంతకాలు ఉన్నట్లు తెలిపారు. ఇదిలావుండగా నబీన్ ఎన్నికను ప్రకటించడం ఇక లాంఛనప్రాయమే. మంగళవారంనాడు ఉదయం 11గంటలకు బిజెపి జాతీయ అధ్యక్షుడిగా నబీన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అందుకు తగ్గట్లుగా పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా బిజెపి కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సిఎంలు, సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.