
ఏకగ్రీవంగా ఎన్నిక
చిన్న వయసులో కాషాయ దళాధిపతిగా బాధ్యతలు
రేపు ప్రమాణ స్వీకారం, హాజరుకానున్న ప్రధాని మోడీ సహా అగ్రనేతలు
న్యూఢిల్లీ : బిజెపి జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. నబీన్ ఒక్కరి తరపున మాత్రమే 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయనకు పోటీగా మరెవరూ నామినేషన్ వేయలేదు. ఈ నేపథ్యంలో ఆయనను బిజెపి తదుపరి జాతీయ అధ్యక్షుడిగా రిటర్నింగ్ అధికారి, బిజెపి రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించారు. నబీన్‌ను మద్దతుగా 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని, అన్నీ కూడా సవ్యంగా ఉన్నాయని వెల్లడించారు. మధ్యాహ్న 2గంటల నుంచి 4గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు.
నబీన్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు సీనియర్ నాయకులు జెపి నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇప్పటి వరకు నబీన్ తరపున మాత్రమే నామినేషన్ దాఖలైందని, పరిశీలన తర్వాత అన్నీ సక్రమంగానే ఉన్నట్లు నిర్ధారించినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల నియామకం ప్రక్రియ పూర్తయిన తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను మొదలు పెట్టినట్లు ఆయన తెలిపారు.
మొత్తం రాష్ట్రాల్లో 50శాతం రాష్ట్రాలు ఎన్నికకు చొరవ చూపితే బిజెపి జాతీయ అధ్యక్షుడి ఎంపిక విధానాన్ని ప్రారంభించడం పార్టీ నిబంధనగా ఆయన తెలిపారు. 37 సెట్ల నామినేషన్లలో 36 ఆయా రాష్ట్రాల నుంచి దాఖలు కాగా, మరొకటి బిజెపి పార్లమెంటరీ బోర్డు నబీన్‌ను ప్రతిపాదిస్తూ నామినేషన్ దాఖలు చేసిందని, దానిపై ప్రధానితో పాటు 37మంది ఎంపిల సంతకాలు ఉన్నట్లు తెలిపారు. ఇదిలావుండగా నబీన్ ఎన్నికను ప్రకటించడం ఇక లాంఛనప్రాయమే. మంగళవారం ఉదయం 11గంటలకు బిజెపి జాతీయ అధ్యక్షుడిగా నబీన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అందుకు తగ్గట్లుగా పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా బిజెపి కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సిఎంలు, సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.
చిన్న వయసులో పెద్ద పదవి…
బీహార్‌కు చెందిన నితిన్ నబీన్ కాయస్త కులానికి చెందిన వారు. 26 ఏళ్ల అతి చిన్న వయసులోనే బిజెపి తరపున ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. ఇప్పుడు 45 ఏళ్ల వయసులోనే బిజెపికి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషం. బీహార్ నుంచి బిజెపి అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తున్న మొదటి వ్యక్తి. ప్రస్తుతం బీహార్ కేబినెట్‌లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 14న ఆయనను బిజెపి కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమించారు. తాజాగా నడ్డా వారసుడిగా నబీన్‌ను పార్టీ ఎన్నుకుంది. 2006లో ఆయన తండ్రి నవీర్ కిశోర్ సిన్హా మరణించడంతో నబీన్ ఎన్నికల రంగంలోకి దిగారు.
పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుంచి నబీన్‌ను బరిలోకి దింపారు. మధ్యలోనే వరల్డ్ ఆఫ్ పాలిటిక్స్ విద్యను వదిలేసి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. వ్యవస్థాగతంగా పరపతి పెంచుకుంటూ వచ్చారు. 2023 నవంబర్‌లో చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నబీన్‌ను పార్టీ ఎన్నికల ఇంచార్జీగా నియమించారు. అక్కడ ఆయన అనుసరించిన వ్యూహం, విజయంలో పోషించిన పాత్ర బిజెపి పెద్దలను కట్టిపడేసింది. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ నబీన్ సక్సెస్ ఫార్ములా ఆ రాష్ట్రంలో 11 స్థానాలకుగాను 10 స్థానాలను తెచ్చి పెట్టింది. ఇవన్నీ నబీన్‌కు కలిసి వచ్చాయి.