Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : ఉగ్రవాదం పట్ల జీరో టాలెరెన్స్ వహించాలని, పొరుగుదేశంలో ఉగ్రవాదానికి ఆజ్యం పోయరాదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పోలండ్ విదేశాంగ మంత్రి రాడొస్లావ్‌కు చురకలంటించారు. పోలండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన రాడోస్లావ్ సికోర్కీతో జైశంకర్ ఢిల్లీలో సోమవారం సమావేశమయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో రాడొస్లావ్ పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు జమ్ముకశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని పాక్ నేతలతో కలిసి సంయుక్త ప్రకటన చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జైశంకర్ భారత్ మిత్రదేశాలు ఉగ్రవాదంతో పోరుకు కలిసి రావాలని, పొరుగుదేశం లోని ఉగ్రవాద వ్యవస్థకు మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఎలాంటి సహాయం చేయకూడదని సూచించారు. 

సుదీర్ఘకాలంగా సరిహద్దు ఉగ్రవాదంతో భారత్ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటోందో రాడోస్లావ్‌కు తెలుసునని జైశంకర్ పేర్కొన్నారు. “ ఉపప్రధాని మీరు మాకు దూరమైన వ్యక్తి కాదు. మా ప్రాంతంలో జరుగుతున్న సీమాంతర ఉగ్రవాదంపై మీకు అవగాహన ఉంటుంది. ఇప్పుడు మనం చర్చించిన అంశం ఇటీవల మీరు పర్యటించిన ఓ దేశానికి సంబంధించినది. పోలండ్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వకూడదు. ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టకూడదు” అని అన్నారు. జైశంకర్ వ్యాఖ్యలకు పోలాండ్ ఉప ప్రధాని అంగీకారం తెలుపుతున్నట్టు తల ఊపారు. ఈ సందర్భంగా రష్యా చమురు కొనుగోలు వ్యవహారానికి సంబంధించి అమెరికా విధించిన టారిఫ్‌ల భారాన్ని ప్రస్తావించారు. ఆర్థిక, సాంకేతిక, రక్షణ, ఖనిజ గనుల తవ్వకాలు, పి2 పి, బహుళ పార్శ సహకారంపై చర్చలు జరిగాయి. భారత్ ఐరోపా సంబంధాలు బలోపేతం కావడానికి పోలాండ్ సహకరిస్తోందని జైశంకర్ ప్రశంసించారు.