
బ్యాంకాక్ : ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా కలిగిన దేశమైన చైనాలో వరుసగా నాలుగో ఏడాదీ జనాభా తగ్గింది. సోమవారం చైనా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 ఏడాది చివరికి చైనాలో 140.4 కోట్ల జనాభా ఉండగా, 2024తో పోలిస్తే 30 లక్షల జనాభా తగ్గింది. 2025లో జననాల సంఖ్య కేవలం 79.5 లక్షలుగా నమోదు కాగా, గత ఏడాదితో పోలిస్తే 17 శాతం తక్కువగా తేలింది. ఆసియా లోని ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. జనాభా తగ్గడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో జీవన వ్యయం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా పిల్లల పెంపకం చాలా ఖర్చుతో కూడుకుని ఉంటోంది.
పిల్లలకు 18 ఏళ్లు నిండేవరకు చదివించడం, ఇతర సౌకర్యాలు కల్పించాలంటే, దాదాపు 75 వేల అమెరికన్ డాలర్లు ( భారత కరెన్సీలో సరాసరి రూ.69 లక్షలు) ఖర్చు అవుతున్నట్టు నిపుణుల అంచనా. అందుకని చాలా మంది యువత పెళ్లికి వెనుకాడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చైనా ప్రభుత్వం పిల్లలను కనేవారికి భారీగాప్రోత్సాహకాలు,రాయితీలు, నగదు బహుమతులు ప్రకటించింది. కండోమ్‌లు, గర్భనిరోధక సాధనాలపై భారీగా 13 శాతం పన్ను విధించింది. పిల్లలున్న కుటుంబానికి పిల్లవానికి 500 డాలర్ల వంతున ప్రోత్సాహకం ప్రకటించింది.