
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తా&, నా గెలుపును బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అడ్డుకోగలరా ?” అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ప్రశ్నించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘విబి జి రామ్ జి’గా మార్పు చేయడం పట్ల ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పేదల హక్కును కాలరాసే అధికారం కేంద్రానికి ఎవరు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. మహిళల దుస్తులపై జరుగుతున్న వివాదం గురించి ప్రశ్నించగా, ఆమె తీవ్రంగా ప్రతిస్పందించారు. మహిళలు ఎటువంటి దుస్తులు ధరించాలన్నది చెప్పేందుకు ఎవరికీ అధికారం లేదన్నారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై పిచ్చిగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఆమె హెచ్చరించారు. మహిళలను అణగ దొక్కాలాని చూస్తే తగిన గుణపాఠం చెబుతామని రేణుకా చౌదరి హెచ్చరించారు.