
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వనదేవతల దర్శనం ముగించుకొని సోమవారం హెలికాప్టర్‌లో నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. మేడారంలో అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్న అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలువురు గ్లోబల్ సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ టూర్ షెడ్యూల్‌లో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు.