
న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడా ప్రాంతంలో శుక్రవారం రాత్రి నీటికుంటలో పడి 27 ఏళ్ల యువరాజ్ మెహతా అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి కేసు మరో మలుపు తిరిగింది. అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన కుమారుడు చనిపోయాడని యువరాజ్ తండ్రి ఆరోపించారు. ఈ క్రమంలో యువరాజ్ మృతి, తదనంతరం పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయం వెల్లడైంది. గుండెపోటు కారణంగానే అతడు మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
జనవరి 17న తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా మెహతా కారు అదుపు తప్పి, సెక్టార్ 150లోని నిర్మాణంలో ఉన్న భవనం బేస్‌మెంట్ కోసం తవ్విన 20 అడుగుల కంటే ఎక్కువ లోతైన గుంతలో పడిపోయింది. ఈ క్రమంలోనే అతడికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు. నిబంధనలు పాటించని నిర్మాణంలో ఉన్న సదరు భవన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధమున్న ఓ జూనియర్ ఇంజినీర్‌ను విధుల నుంచి తొలగించారు. యువరాజ్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ అతడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడంతో ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.