Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు భారత క్రికెటర్లే కాదు.. విదేశీ క్రికెటర్లు కూడా పోటీ పడుతుంటారు. అయితే ఐపిఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని కొన్నిసార్లు పుకార్లు వినిపిస్తుంటాయి. అయితే అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని.. వాస్తవానికి ఐపిఎల్‌లో ఫిక్సింగ్ జరిగే అవకాశం లేదని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నారు.

పార్థివ్ ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడారు. ప్రస్తుతం ఆయన గుజరాత్ టైటాన్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఐపిఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ రూమర్స్‌పై ఓ పాడ్‌క్యాస్ట్‌లో పార్థివ్ మాట్లాడుతూ.. ‘‘ఐపిఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఫిక్స్ కాలేదు. మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో ముందే తెలియడం అనేది అసాధ్యం. ఫోన్లు, ఈ మెయిల్స్, హోటల్‌లోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? ఇలా అన్నీ రికార్డ్ అవుతాయి. చాలా గట్టి భద్రత ఉంటుంది’’ అని అన్నారు.

‘‘అందరికీ అక్రిడేషన్ అవసరం. కెప్టెన్‌కు అక్రిడేషన్ లేకపోయినా అతడిని మైదానం, డ్రెస్సింగ్ రూంలోకి అనుమతించరు .ఒక్క ఐపిఎల్ అని మాత్రమే కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఫిక్సింగ్ జరిగిందని జనాలు చాలా తేలికగా నిందలు వేస్తారు. కానీ వాటిని నిరూపించడం కష్టమే’’ అని పార్థివ్ పేర్కొన్నారు. అయితే.. 2013 ఐపిఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను రెండు సీజన్ల పాటు సస్పెండ్ చేశారు.