
మరికొన్ని రోజుల్లో టి-20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈసారి భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే ఈ టోర్నమెంట్‌కి ముందు సౌతాఫ్రికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జట్టు విధ్వంసకర ఆల్ రౌండర్ డోనోవన్ ఫెరీరాకు గాయమైంది. సౌతాఫ్రికా టి-20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ఫెరీరా శనివారం ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు.
మ్యాచ్ చివరి ఓవర్‌లో బౌండరీ వద్ద బంతిని ఆపే క్రమంలో అతడి భుజం బలంగా నేలకు తాకింది. దీంతో ఫెరీరా తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయాడు. అయితే జట్టు కష్టాల్లో ఉన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితిలో అతడు బ్యాటింగ్‌కి వచ్చాడు. కేవలం ఒకే ఒక బంతిని ఎదురుకొని రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం అతడికి స్కానింగ్ నిర్వహించారు. స్కానింగ్‌లో అతడి భుజం వద్ద ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు గుర్చించారు. దీంతో మిగితా టోర్నమెంట్‌కు అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు టి-20 ప్రపంచకప్‌కి కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే జరిగితే సౌతాఫ్రికాకు చాలా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఫెరీరా గాయపడటం ఆ జట్టుకు తీరని లోటు. 2024 నుంచి టి-20ల్లో అత్యధిక స్ట్రైక్ రేటుతో ఫెరీరా కొనసాగుతున్నాడు. గత నెలలో భారత్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఫెరీరా ఇరగదీశాడు. అతడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఒకవేళ అతడు జట్టుకు దూరమైతే.. ర్యాన్ రికెల్టన్ లేదా ట్రిస్టన్ స్టబ్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.