
ఇండోర్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్‌తో జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే మూడో వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(124) జట్టును గెలిపించేందుకు చాలా ప్రయత్నించాడు. అతడికి హర్షిత్ రాణా మంచి సహకారం అందించాడు. అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. కానీ, భారత్‌కు ఓటమి తప్పలేదు. అయితే మ్యాచ్ ఓడిపోయినా హర్షిత రాణా పోరాట పటిమను అంతా మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా రాణాపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా రాణా షార్ట్ పిచ్ బంతులను సమర్థవంతగా ఎదురుకున్నాడని అన్నారు.
‘‘హర్షిత్ రాణా చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఏ మాత్రం కంగారు లేకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అంచనాలు లేకుండా క్రీజ్‌లోకి వచ్చి.. పరుగులు రాబట్టాడు. షార్ట్ పిచ్ బంతులను సమర్థవంతంగా ఎదురుకొని పరుగుల వరదపారించాడు. కళ్లు చెదిరే సిక్సులు కొట్టాడు. అది నన్ను ఎంతో ఆకట్టుకుంది’’ అని గవాస్కర్ అన్నారు. హర్షిత్ రాణా, విరాట్ కోహ్లీలు కలిసి 69 బంతుల్లో 99 పరుగులు భాగస్వామ్యం జత చేశారు. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్ విజయంపై అభిమానులకు అశలు ఉండేవి. కానీ త్వరగా పరుగులు చేయాలనే ప్రయత్నంలో ఇరువురు ఔట్ అయ్యారు. దీంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.