
హైదరాబాద్: రాష్ట్రంలో కొద్ది రోజులుగా సింగరేణి స్కాంలు, మంత్రుల మధ్య వాటాల పంచాయితీ చూస్తున్నామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సైట్ విజిట్ విధానంపై దేశ వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం గతంలో లేదని, 2024లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని తీసుకువచ్చారని తెలియజేశారు. నైనీ బ్లాక్ కాంట్రాక్ట్ రద్దు చేశామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చెబుతున్నారని, సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం వెనుక కుట్ర ఉందని విమర్శించారు. ప్రస్తుత నిబంధనలతో టెండర్ ఎవరు వేస్తున్నారో ముందే తెలిసిపోతుందని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిజాయితీ ఉంటే దీనిపై విచారణ చేయించు అని సూచించారు.
కాంగ్రెస్ తో బిజెపి కుమ్మక్కు కాకపోతే.. వెంటనే ఈ అంశంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని, గతంలో జరిగిన టెండర్లు రద్దు చేసి తమ అనయాయులకు దక్కేవిధంగా చూస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే.. తాను అన్ని ఆధారాలు సమర్పించేందుకు సిద్ధం అని సవాల్ విసిరారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నానని, బిఆర్ఎస్ దిమ్మెల జోలికొస్తే.. దుమ్ము దుమ్మయిపోతావ్.. అని మండిపడ్డారు. ఆయనకు తెలియకుండా సిట్ ఎలా వేస్తారు? అని అసలు సిఎం కు తెలియకుండా సిట్ వస్తుందా? అని ప్రశ్నించారు. అదే నిజమైతే సిఎంగా ఆయన ఫెయిల్ అయినట్టే అని సిఎంకు తెలియకుండా సిట్ వేశారంటే అది అడ్మినిస్ట్రేషన్ మీద నీకు పట్టు లేదని అర్థమైందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డే హోం మినిస్టర్, రేవంత్ రెడ్డే సిఎం అని హరీశ్ రావు దుయ్యబట్టారు.