
రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
నేడో రేపో షెడ్యూల్ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర కేబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుమతి తెలిపింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రిజర్వేషన్ల నివేదికను కూడా ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నది. 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల రిజర్వేషన్లు ఖరారు చేసిన వివరాలు ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు.
ఈ రిజర్వేషన్ల ప్రకారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థలలో మహిళలు, బిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిలకు తగిన రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, ఇకపై ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం మాత్రమే మిగిలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకటి రెండు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.