Reading Time: 4 minutes

మరో వందేళ్లు పేదల కోసం పనిచేయండి

కలిసికట్టుగా పోరాడి మోడీని గద్దె దించుదాం.. రాహుల్‌ను ప్రధానిని చేద్దాం

రాజ్యాంగాన్ని చెరపట్టేందుకే ‘సర్’ తెచ్చారు

మోడీ, అమిత్ షా కట్టగట్టుకుని వచ్చినా ఖమ్మంలో సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేరు

సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

ప్రజల కోసం మరో వందేళ్లు పోరాడటానికి సిద్ధం

కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మాత్రమే ఇంతటి రాజకీయ చరిత్ర ఉంది

దేశంలో మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయి

సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ధ్వజం

ఖమ్మంలో ఘనంగా సిపిఐ శతాబ్ది ఉత్సవాలు

వేలాదిగా తరలివచ్చిన కమ్యూనిస్టు కార్యకర్తలు

ఖమ్మం వీధుల్లో ఎర్ర జెండాలతో కవాతు

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాబోయే వందేళ్లు కూడా కమ్యూనిస్టులు పేద ప్రజల కోసం పోరాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు ప్రజల కోసం కష్టపడతారని, కొట్లాడుతారని, వారి నినాదాలనే కాంగ్రెస్ పార్టీ చట్టాలను, శాసనాలను చేస్తుందన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో ఎస్‌ఆర్‌ఆండ్‌బిజిఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో ఆయన సహార్ధ సందేశం ఇచ్చారు. ముగింపు సభ సందర్బంగా ఖమ్మం నగరంలో సిపిఐ నిర్వహించిన భారీర్యాలీతో ఖమ్మం నగరం ఎర్రబారింది. బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ కాంగ్రెస్, కమ్యూనిస్టులు వేర్వేరు కాదని, ఇరు పార్టీలు కలిసి దేశ స్వాతంత్యం కోసం పోరాడిన చరిత్ర ఉందన్నారు.

ఆనాడు కమ్యూనిస్టులు ఇచ్చిన ప్రజారాజ్యం పిలుపుతోనే ఈనాడు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. క మ్యూనిస్టులు చేసిన ఎన్నో ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ ప్ర భుత్వం అనేక చట్టాలను, పథకాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రాణాలు కోల్పోతామేగానీ ఎర్రజెండాను వదలమని ప్రకటించిన కమ్యూనిస్టు కామ్రేడ్లకు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వందనాలు తెలిపారు. దున్నేవాడిదే భూమి అన్న నినాదాన్ని కమ్యూనిస్టులు ప్రజల్లోకి తీసుకెళ్లారని, ఆ సిద్ధాంతాన్ని అమల్లోకి తెచ్చింది ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావువంటి కాంగ్రెస్ నేతలేనని ఆయన గుర్తు చేశారు.

రైతులు పంటకు ధర నిర్ణయించలేని పరిస్థితుల్లో కనీస మద్దతు ధర కోసం కమ్యూనిస్టులు పోరాడారని తెలిపారు. రైతులు, రైతు కూలీలు, హరిజనులు, గిరిజనుల హక్కుల కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. నాలుగు వేలమంది అమరవీరుల త్యాగాల ఫలితంగానే హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలననుంచి విముక్తి అయిందని సీఎం పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, శేషగిరిరావు వంటి ఎందరో నాయకులునాడు ప్రజల కోసం పోరాడారని స్మరించారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా నాడు సాగిన పోరాటాలే నేటి ప్రజాస్వామ్యానికి పునాదులని అన్నారు.

బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు… బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఉపాధి హామీ పథకం తెస్తే, బీజేపీ ప్రభుత్వం దానిని రద్దు చేసిందని ఆరోపించారు. ఉపాధి హామీ రద్దుతో అగ్గువకో సగ్గువకో అదానీ-అంబానీలకు కూలీలు దొరికే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. పేదల హక్కులు కొల్లగొట్టడానికి, రాజ్యాంగాన్ని మార్చడానికి 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారని, కాని రాహుల్‌గాంధీ, కమ్యూనిస్టులు కలిసి రాజ్యంగాన్ని రక్షించాలని చేసిన పోరాటంతో ఆ పార్టీ 240 సీట్లవద్ద ఆగాల్సి వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని చెరపట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఓటు హక్కు రద్దు చేసేందుకు ‘సర్’ తెచ్చారని, రాజ్యాంగ సభ సమయంలోనూ గోల్వాల్కర్ వారసులు పేదలకు ఓటు హక్కు లేకుండా చేయాలని ప్రయత్నించారని గుర్తు చేశారు. ఓటు హక్కు లేకపోతే రేషన్ కార్డు, ఇల్లు, పింఛన్ అన్నీ పోతాయని ప్రజలను అప్రమత్తం చేశారు. ‘మూలవాసులు ఎక్కడి నుంచి ఆధారాలు తెస్తారు? అని ప్రశ్నించారు.

బ్రిటిష్ కంటే బీజేపీ ప్రమాదకరం!

దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, బ్రిటిష్ పాలనకన్నా బీజేపీ మరింత ప్రమాదకరంగా మారిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు సహా ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమవాలని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ రెండు పార్టీల పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనేక విధానాలు తీసుకొచ్చి ప్రజల హక్కులను కాలరాస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలు కొనసాగుతున్నాయని, వాటికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాటం చేయాల్సిన సమయం అసన్నమైందన్నారు

ఖమ్మంలో బీజేపీకి చోటు లేదు

కాంగ్రెస్, కమ్యూనిస్టులు అనే తేడా లేకుండా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దండు కట్టాలని సీఎం ఈ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ పేదల పక్షానే నిలబడి పోరాడతారని కొనియాడారు. నేటి ఈ ప్రజా ప్రభుత్వంలో మీ శ్రమ ఉంది’ అంటూ కమ్యూనిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉందని, నరేంద్ర మోదీ, అమిత్ షాలు కట్టగట్టుకుని వచ్చినా ఇక్కడ ఇద్దరు సర్పంచులను కూడా బిజెపి గెలిపించుకోలేరని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘తులసీ వనంలో గంజాయి మొక్కకు చోటు లేనట్టే, ఖమ్మం జిల్లాలో బీజేపీకి చోటు లేదు అంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి రాజకీయ స్థానం లేదన్నారు. బిజెపికి నరేంద్రమోడి ,అమిషా ఉన్నా ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఇద్దరు సర్పంచులు కూడా లేరని పేర్కొన్నారు. కమ్యూనిస్టు సోదరులు ఈ ప్రాంతంలో బలమైన ఉద్యమాలను నెలకొల్పడం వల్లేనే ఈరోజు బీజేపీకి ఇక్కడ స్థానం లేకుండాపోయిందన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం మొత్తం బీజేపీ, నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగానే ఉంటుందని, ఈ పోరాటంలో కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి రావాలని సిఎం పిలుపునిచ్చారు. మీరందరూ కలిసి రండి. బిజెపిని గద్దె దింపి రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిని చేద్దాం’ అంటూ సిపిఐ సభా వేదికనుంచి సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రజల కోసం మరో వందేళ్లు పోరాటానికి సిద్ధం: డి. రాజా

నమ్ముకున్న ప్రజలకోసం మరో వందేళ్లపాటు పోరాడేందుకు సిపిఐ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. గడిచిన వందేళ్లుగా ప్రజల పక్షాన పోరాడుతున్నామని, ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సిపిఐ మాత్రమేనన్నారు. వందేళ్లు త్యాగాలతోనే గడిచిపోయిందని అనేకమంది తమ త్యాగాలతో ఈ నేలను పునీతం చేశారన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మాత్రమే ఒక రాజకీయ చరిత్ర ఉందని వందేళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్న ఆర్‌ఎన్‌ఎస్‌కు అసలు చరిత్ర లేదన్నారు. దేశ స్వాతంత్య్రంలోనూ, ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఏమిటని రాజా ప్రశ్నించారు. చరిత్రలేని వారు దేశభక్తులుగా చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీకంటే ముందే సిపిఐ సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు.

స్వాతంత్య్రం అనంతరం అనేక పరిణామాలలో కమ్యూనిస్టు పార్టీ అత్యంత కీలక భూమిక పోషించిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతగా వ్యవహరించాలని ప్రయత్నిస్తున్నాడని, మరో హిట్లర్ కావాలనుకుంటున్నాడని ట్రంపును ఎర్ర జెండాలు ఎదుర్కొంటాయని రాజా స్పష్టం చేశారు. సామ్రాజ్యవాద ధోరణితో ట్రంప్ వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. మెక్సికో, కోలంబియా, క్యూబావంటి దేశాలకు బెదిరింపులు చేయడం అనుచితమన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న ట్రంపును ప్రశ్నించే శక్తి భారత ప్రధాని మోడీకి లేదన్నారు.

భారత్ రష్యానుంచి చమురు కొనుగోళ్లు చేస్తుందని, దీనిని నిలిపివేయాలంటూ అమెరికా ఒత్తిడి తీసుకు రావడం శోచనీయమన్నారు. పాలస్తీనా అంశాన్ని ప్రస్థావిస్తూ పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఉండే హక్కు ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న ద్విరాష్ట్ర పరిష్కారానికి సిపిఐ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయని, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుందని ఇది దేశ భవిష్యత్తుకు మరింత ప్రమాదకరమన్నారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించిన సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇంచార్జ్ మంత్రి వాకాటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్జిత్ కౌర్, గిరిశర్మ, అనిరాజా, ప్రకాష్ బాబు, సందోష్ బాబు, పల్లా వెంకటరెడ్డి, బినయ్ విశ్వం, రామకృష్ణ పాండా, కె. రామకృష్ణ, కుల్దేవ్, జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె. నారాయణ, సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, మీడియా అకాడమీ ఛైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహయ కార్యదర్శులు తకెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నర్సింహ, సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, ఎస్కో సాబీర్ పాషా, వనజా, నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఎంఎల్సీ ఎన్. సత్యం, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.