Reading Time: 3 minutes

రెండో వారంలో ఎన్నికలు

జిల్లాల పునర్విభజనకు రిటైర్డ్ జడ్జితో కమిషన్

గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు

నదీ పరివాహకంలోని ఆలయాల అభివృద్ధికి సర్కూట్

మెట్రో రెండో దశ కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం

ఎంజి వర్సిటీకి కొత్త పోస్టుల మంజూరు

అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఎకోటౌన్, 494 ఎకరాల భూమి కేటాయింపు

బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లే అవుట్ రోడ్డు వరకు కొత్త రోడ్డు

ములుగు జిల్లాలో పొట్లాపూర్ఎ త్తిపోతల పథకం

మేడారంలో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

18 అంశాలపై కేబినెట్‌లో చర్చ

అభివృద్ధి పనులు పరిశీలించిన సిఎం, మంత్రులు

మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి రెండోవారంలో మున్సిపల్ ఎన్నికలను జరపాలని మం త్రివర్గం నిర్ణయించింది. వీలైనంత తొందరగా ము న్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రయోజ నాలకు సంబంధించి కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారుగా 18అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ప్రధానంగా జిల్లాల పునర్విభజన, మున్సిపల్ ఎన్నిక లు, యాసంగి రైతు భరోసా, గోదావరి, కృష్ణా పు ష్కరాలు వంటి తదితర అంశాలపై చర్చించారు. జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదించడంతో పాటు దీనికోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

మేడారంలోని సమ్మక్క సారలమ్మ వద్ద హరిత హోటల్‌లో జరిగిన కేబినెట్ భేటీ సుమారుగా రెండుగంటల పాటు జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి సీతక్క విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 27వ కేబినెట్ మీటింగ్ మేడారంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏకాభిప్రాయంతో ఇక్కడ కేబినెట్ జరుపుకున్నామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించి 14 ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలకు ప్రభుత్వ భూములను కేటాయించామని వారు తెలిపారు. రాష్ట్రంలో పదవీ కాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లు, 2,996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరపాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినందున ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.

ఎకో టూరిజం అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీ

ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగలు ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ రూపొందించుకోవాలని అధికారులకు కేబినెట్ సూచించిందన్నారు. 2027 జూలై 27వ తేదీ నుంచి ఆగష్టు 3వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు త్వరలో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని కేబినెట్ అధికారులకు సూచించిందన్నారు. దీనికోసం దేవాదాయ, రెవెన్యూ, అటవీ, పర్యాటక, పురావస్తు శాఖలు సంయుక్తంగా పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించిందన్నారు. మార్చి 31వ తేదీ నాటికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కేబినెట్ ఆదేశించిందని వారు తెలిపారు.

మెట్రో ఫేజ్-2 కోసం భూ సేకరణ వేగవంతం చేయాలి

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్1 ప్రాజెక్ట్‌ను ఎల్ అండ్ టి నుంచి స్వాధీనం చేసుకునేందుకు సంబంధించి ఇంతవరకు జరిగిన పురోగతిని కేబినెట్ సమీక్షించిందని వారు తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిందన్నారు. మెట్రో ఫేజ్2 ఏలోని నాలుగు కారిడార్లు, ఫేజ్-2 బిలోని మూడు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయని ఈలోపు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు.రూ.2,787 కోట్ల అంచనా వ్యయమయ్యే భూ సేకరణ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించిందని వారు తెలిపారు.

మహాత్మాగాంధీ యూనివర్సిటీకి కొత్త పోస్టులు

నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రులు తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ లో రిజిస్ట్రార్ పోస్టుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఎకో టౌన్ డెవలప్‌మెంట్‌కు టిజిఐఐసికి 494 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు బంజారాహిల్స్ లోని ఐసిసిసి నుంచి శిల్పా లే ఔట్ రోడ్డు వరకు కొత్తగా 9 కి.మీ. కొత్త రోడ్డు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ములుగు జిల్లాలో కొత్తగా పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను కేబినెట్ ఆమోదించిందన్నారు. రామప్ప చెర్వు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ములుగు జిల్లాలోని 5 గ్రామాలు, 30 చెర్వులు కుంటలను నింపడంతో పాటు 7,500 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించనుంది. రూ.143 కోట్ల అంచనా వ్యయంతో ఈ స్కీం చేపట్టనున్నట్టు మంత్రులు తెలిపారు.

ములుగుకు గోదావరి జలాల తరలింపునకు రూ.143 కోట్లు : మంత్రి సీతక్క

క్యాబినెట్లో ములుగుకు గోదావరి జిల్లాలు తరలించేందుకు రూ.143 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును మంజూరు చేశారని మంత్రి సీతక్క తెలిపారు. తన జీవితంలో రెండే రెండు కలలుండేవని, ఒకటి మేడారం ఆలయ అభివృద్ధి, రెండు ములుగు నియోజకవర్గానికి గోదావరి జలాలని వెల్లడిం చారు. గతంలో గోదావరి జలాల కోసం ఎన్నో పాదయాత్రలు జరిగాయి. కానీ నేడు ఇలాంటి యాత్రలు చేపట్టకుండానే సిఎం రేవంత్‌రెడ్డి తమ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేశారన్నారు. సమ్మక్క సారలమ్మ చరిత్రను మరో వేయిళ్లు ఉండేలా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రికి, తమ వంతు సహకారం అందజేసిన మంత్రివర్గ సహచరుల అందరికీ ఒక ఆదివాసి బిడ్డగా పేరుపేరునా ధన్యవాదాలన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవలను యావత్ ఆదివాసి సమాజం ములుగు నియోజకవర్గం గుర్తుంచుకుంటుందని తెలిపారు. తమ కుల ఇలవేల్పు కోసం గత పాలకులు ఓ గుడిని నిర్మించారన్నారు. కానీ రేవంత్ రెడ్డికి సమ్మక్క సారలమ్మతో కుల బంధం, కుటుంబ బంధం లేకపోయినప్పటికీ సకల జనులకు ఆరోగ్య దైవమైన సమ్మక్క సారాలమ్మల పట్ల ముఖ్యమంత్రికి అపారమైన భక్తి భావం ఉందన్నారు. అలాగే, సమ్మక్క సారలమ్మ గుడి తో ముఖ్యమంత్రి కి భావోద్వేగ బంధం ఉందని తెలిపారు. అందుకే కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలో గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారని, ఆదివాసిల గుండెల్లో ఎప్పుడు రేవంత్ రెడ్డి నిలిచిపోతారని చెప్పారు. రాష్ట్రం వెలుపల మేడారం అడవిలో, ఆదివాసి ప్రాంతంలో ఆదివారం క్యాబినెట్ నిర్వహించుకోవడం ఒక చరిత్ర అని ఆమె గుర్తు చేశారు.