Reading Time: 2 minutes

 ఆస్తుల కోసమో, వ్యాపార విస్తరణ కోసమో రాజకీయాల్లోకి రాలేదు

దోపిడీదారులు, నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడుతా

బొగ్గు గనులు ప్రజల ఆత్మగౌరవం రాజకీయ దురుద్దేశాలతో నాపై అడ్డగోలు రాతలు

అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తా:  డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క

నైనీ బొగ్గు గనుల టెండర్లు రద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: ఆరోపణలు రావడంతోనే సింగరేణి టెండర్లు రద్దు చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, ఆత్మను కాపాడటమే తన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆస్తుల సంపాదన కోసమో, వ్యాపారాన్ని విస్తరించుకునేందుకో రాజకీయాల్లోకి తాను రాలేదన్నారు. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో ఓ పత్రికలో అడ్డగో లు రాతలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం హైదరాబాద్ ప్రజా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. తె లంగాణ రాష్ట్ర ఆస్తులు, వనరులను సంరక్షించి, పేదలకు సమానంగా పంచడమే తమ లక్ష్యమని భట్టి వి క్రమార్క వెల్లడించారు. దిగజారుడు రాజకీయాల కో సం అబద్ధపు వార్తలు అల్లే సంస్కృతి తనది కాదని, త న క్యారెక్టర్ అంత వీక్ కాదని ఆయన స్పష్టం చే శా రు. మీడియా సంస్థల ఆరోపణలపై తక్షణమే స్పం దించిన ఆయన, పారదర్శకత కోసం సదరు టెండర్ల ను రద్దు చేసి, తిరిగి టెండర్లు పిలవాలని అధికారుల ను ఆదేశించినట్లు వెల్లడించారు. జర్నలిస్టుల అరెస్టు లు, సిట్ ఏర్పాటు వంటి అంశాలను ముడిపెడు తూ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని భట్టి ఆరోపించారు.

టెండర్ నిబంధనలు బోర్డు నిర్ణయిస్తుందని, ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై ఇలాంటి కథనాలు రాసిన వారు త్వరలోనే పూర్తి వివరాలతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని, వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారుల క్యారెక్టర్లపై కట్టుకథలు ప్రసారం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించిన ఆయన, ఈ వ్యవహారంపై త్వరలోనే పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలను బయటపెడతానని తేల్చి చెప్పారు. సింగరేణి సంస్థ, నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లను పిలిచిందని అన్నారు. దీనిపై కట్టు కథ, పిట్ట కథలు అల్లి ప్రజలను మభ్యపెట్టేలా కథనం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు సూచించామని, తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిని కావడంతో ఆయనపై ఉన్న కోపం తన మీద చూపిస్తున్నారని అన్నారు. ఆ పత్రికలో వచ్చిన కథనం వెనక రాజకీయ ఉద్దేశం ఏమిటో తెలిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతానని ప్రకటించారు. ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసే కథనాలు రాసే అధికారం ఎవరికీ లేదని, నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు కట్టు కథలు రాశారని డిప్యూటీ సీఎం దుయ్యబట్టారు.

దీనికి భయపడి లొంగిపోయే వ్యక్తిని కాదని, సింగరేణి ప్రజల ఆస్తి అని, బొగ్గు గనులు ప్రజల ఆత్మ గౌరవమని, పదవుల కోసం కాదని, ప్రజాసేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థేనని, మంత్రి కాదని గుర్తు చేశారు. క్లిష్ట ప్రాంతాల్లో గనులు ఉన్నందున ఫీల్ విజిట్ నిబంధన తప్పనిసరి అని, ఇలాంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ ఉన్నాయని తెలిపారు. ఓ ఛానల్ కథనంలో తన పేరును అనవసరంగా తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సంస్థల మధ్య ఉన్న వైరంలోకి ప్రజా ప్రతినిధులను లాగవద్దని, వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లడం తగదని సూచించారు.