Reading Time: 2 minutes

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా..? అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి, కనీస సోయి లేకుండా బిఆర్‌ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడంపై కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత పదేళ్ల కాలంలో లా అండ్ ఆర్డర్ నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో, నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచే వారు అధికారంలో ఉండటం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాపై ఉన్న చెక్కుచెదరని అభిమానాన్ని చూసి ముఖ్యమంత్రికి మైండ్ బ్లాక్ అయ్యిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేవలం రెండేళ్ల కాలంలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ రెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని ఆదివారం సభ సాక్షిగా తేలిపోయిందని విమర్శించారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే చురుగ్గా స్పందించి అరెస్టులు చేసే పోలీసు శాఖ, రాష్ట్ర డిజిపి… ముఖ్యమంత్రి చేసిన ఈ తీవ్రమైన. హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కెటిఆర్ బిఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

టిడిపి పాట పాడటం వెనుక ఉన్న అసులు కుట్ర అర్థమైంది

కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనుక ఉన్న అసలు కుట్ర తెలంగాణ సమాజానికి అర్థమైందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా తన పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జలహక్కులను రేవంత్ రెడ్డి కాలరాశారని, ఇవాళ ఆయన చేసిన ప్రకటనతో నిజస్వరూపం బట్టబయలైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే నావ అని అర్థం కావడంతోనే, రేవంత్ రెడ్డి ఏ క్షణమైనా దాని నుంచి బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆరోపించారు.

బిఆర్‌ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఒకవైపు బిజెపితో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ, మరోవైపు తెలంగాణ ప్రజలు తిరస్కరించిన టిడిపిని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి పన్నాగం పన్నుతున్నారని, దీనిని నాలుగు కోట్ల తెలంగాణ సమాజం తప్పకుండా తిప్పికొడుతుందని పేర్కొన్నారు. నీళ్ల నుంచి మొదలుకొని నిధులు, నియామకాల వరకూ తెలంగాణ ప్రయోజనాలను పాతాళంలోకి నెట్టిన కోవర్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కెటిఆర్ హెచ్చరించారు.