
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్‌సెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కానున్నాయి. ఇప్పటికే వివిధ ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించడంతో పాటు పరీక్షల షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజిఎప్‌సెట్ మే 4 నుంచి 11 వరకు ఎప్‌సెట్ పరీక్షలు జరుగనున్నాయి.
మే 4,5 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9,10,11 తేదీలలో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే మే 12న ఎడ్‌సెట్, మే 13, 14 తేదీలలో ఐసెట్, మే 15న ఇసెట్, మే 18న లాసెట్, పిజిఎల్‌సెట్, మే 28,31 తేదీలలో పిజిఇసెట్, మే 31 నుంచి జూన్ 3 వరకు పిఇసెట్ పరీక్షలు జరుగనున్నాయి. త్వరలో సెట్ కమిటీలు నిర్వహించి పూర్తి స్థాయి షెడ్యూల్ ప్రకటించన్నారు. ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ అయిన వెంటనే ఎప్‌సెట్ షెడ్యూల్ విడుదల చేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు.