
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మహిళా ఐఎఎస్ అధికారుల పరువును బజారుకు ఈడుస్తున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ పరిణామాల వల్ల మహిళా అధికారులు రాష్ట్రంలో పని చేయడానికే భయపడుతున్నారని, ఫలితంగా దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డి తీరుపై, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. మహబూబ్‌నగర్‌లో సిఎం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఎన్నికల ప్రసంగంలా ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికలు సమీపించినప్పుడే సిఎంకు పథకాలు గుర్తుకొస్తాయని, మున్సిపల్ ఎన్నికల కోసమే మళ్లీ చీరల పంపిణీ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు.
పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బిజెపిలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఇటీవల ఇరు పార్టీల నేతలు పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకోవడం మున్సిపల్ ఎన్నికల్లో వారి కుమ్మక్కుకు నిదర్శనమని అన్నారు. శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం చేతకాదని విమర్శించారు. కల్వకుర్తి నెట్టంపాడు బీమా కింద ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచింది కెసిఆర్ కాదా…..కెసిఆర్ తెచ్చిన పంపులు,కట్టిన కాలువలు కనిపించడం లేదా..? అని అడిగారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు ఏడు అనుమతులు వచ్చాయని, ఇంకో అనుమతి సాధించి 90 టిఎంసిల నీళ్లు సాధించాలని అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ చేసింది శూన్యం అని, పాలమూరు వెనబాటుకు కారణం కాంగ్రెస్ అని విమర్శించారు.