
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే జెఇఇ మెయిన్ సెషన్1 పరీక్షలు బుధవారం (జనవరి 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) విడుదల చేసిన విషయం తెలిసిందే. జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు జరిగే జెఇఇ మెయిన్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఎన్‌టిఎ పలు కీలక సూచనలు చేసింది. పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా అడ్మిట్ కార్డుని వెంట తీసుకెళ్లండి. అలాగే, ఎన్‌టిఎ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారంను కచ్చితంగా నింపాలి. అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
అడ్మిట్ కార్డులో ఉన్న సూచనలను క్షుణ్ణంగా చదివి, అందులో పొందుపరిచిన అన్ని నిబంధనలు పాటించాలి. పరీక్ష రాసే విద్యార్థులు తమ ధ్రువీకరణను నిర్ధారించే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసు పుస్తకం.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. అలాగే పాస్‌పోర్టు సైజ్ ఫొటోను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లడం మరిచిపోవద్దు. విద్యార్థులు దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్ చేసిన ఫొటోను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దాన్ని అటెండెన్స్ షీట్‌లో అతికించాల్సి ఉంటుంది.
వీటిని అనుమతించరు
చిరుతిళ్ళు, జామెట్రీ/ పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్ మెటీరియల్, వాటర్ బాటిళ్లు, మొబైల్‌ఫోన్/ఇయర్ ఫోన్/మైక్రోఫోన్/పేజర్, కాలిక్యులేటర్, డాక్యుపెన్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు/గ్యాడ్జెట్లు/పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. వీటితో పాటు హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు, నగలు, మెటాలిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి నిషేధం. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు జెఇఇ మెయిన్ వెబ్‌సైట్‌లోని హెల్ప్‌లైన్ నెంబర్ 011 -40759000కు లేదా jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.