
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక హార్వర్డ్ విద్యార్థిగా కొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. దేశంలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్సు చేసి సర్టిఫికెట్ అందుకోబోతున్న మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అరుదైన ఘనత సాధించబోతున్నారు. ప్రపంచంలోని నెంబర్‌వన్ విద్యాసంస్థలలో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో లీడర్‌షిప్: 21 సెంచరీ అనే కోర్సుకు హాజరుకాబోతున్నారు. దీంతో భారతదేశ చరిత్రలో ఒక ఐవీ లీగ్ కార్యక్రమానికి హాజరవుతున్న మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానున్నారు. ఈ కోర్సు పేరు 21వ శతాబ్దంకోసం నాయకత్వం(అస్తవ్యస్తత, సంఘర్షణ, ధైర్యం).
ఈ కోర్స్ కోసం ఆయన ఈ నెల 25 నుంచి 30 వరకు మసాచుసెట్స్‌లోని కెనడీ స్కూల్ క్యాంపస్‌లో ఉండి తరగతులకు హాజరవుతారు. ఐదు ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు ఈ కోర్సుకు హాజరు కాబోతున్నారు. వీరితో కలిసి రేవంత్ రెడ్డి తరగతులు, అసైన్‌మెంట్‌లు, హోమ్‌వర్క్‌లు పూర్తి చేసి గ్రూప్ ప్రాజెక్టులు కూడా నిర్వహిస్తారు. ఈ కోర్సుకు ప్రొఫెసర్ టీం ఓ బ్రియాన్ ఛైర్మన్‌గా, ప్రొఫెసర్ కరెన్ మోరిసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కోర్సులో భాగంగా ప్రతినిధి బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాల నుండి కేస్ స్టడీలను విశ్లేషించి, పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీనుంచి సర్టిఫికెట్ పొందనున్నారు.