Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్‌ః “పాత నగరంలోని చార్మినార్ మున్సిపల్ కార్పొరేషన్ జోన్‌లో రంగారెడ్డి జిల్లాలోని పలు మున్సిపాలిటీలను కలుపుతారా?” అని చేవేళ్ళ నియోజకవర్గం బిజెపి లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పాతనగరంలో పన్నులు కట్టని వారిని, నిజాయితీగా సకాలంలో పన్నులు చెల్లించే వారిని ఒక దగ్గర కలుపుతారా? అని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాతనగరంలో ఒక వర్గానికి చెందిన వారు విద్యుత్తు, నీటి బిల్లులు, మున్సిపల్ బిల్లులు చెల్లించరని ఆయన ఆరోపించారు.

రంగారెడ్డి జిల్లాలోని పలు మున్సిపాలిటీలను చార్మినార్ జిహెచ్‌ఎంసి జోన్‌లో విలీనం చేయడం ద్వారా తాము సకాలంలో చెల్లించే పన్నులతో అభివృద్ధి చేపడతారని ఆయన తెలిపారు. ఏ మాత్రం పన్నులు చెల్లించని పాతనగరంలో విలీనం చేయడానికి ఎవరిని అడిగి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్, బడంగ్‌పేట్, ఆదిభట్ల, ఇంకా చేవేళ్ళలోని పలు మున్సిపాలిటీలను చార్మినార్ జిహెచ్‌ఎంసిలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాను ముక్కలు చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదంతా శాస్త్రిపురం, వట్టెపల్లి ఒవైసీ హిల్స్‌లో తీసుకున్న నిర్ణయం అని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కాంగ్రెస్ అంటేనే ముస్లింలని, ముస్లింలు అంటనే కాంగ్రెస్ అని చెప్పడంతో వారు తలపైకి ఎక్కి కూర్చుంటున్నారని ఆయన విమర్శించారు. విలీనం చేయడం ద్వారా రంగారెడ్డి జిల్లా నిరుద్యోగులు ఉద్యో గాలు కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హరియానాలోని గుర్‌గావ్ జిల్లా ఒకప్పుడు ధనిక జిల్లాగా ఉండేదని, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఆ స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు. దేశంలో రంగారెడ్డి ఇప్పుడు అత్యధిక ధనిక జిల్లాగా ప్రఖ్యాతి చెందిందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, పార్టీ నాయకుడు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.