Reading Time: 2 minutes

రిటర్న్ జర్నీలో నరకం..

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రద్దీ

నేడు కూడా రద్దీ కొనసాగే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పండుగ ముగియడంతో వలస జీవులు పల్లె నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. పండుగ జ్ఞాపకాలను మదిలో నింపుకుని పిల్లా పాపలు, కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి కోసం పరుగులు తీశారు. మూడు రోజుల పాటు సొంతూర్లలో బంధువులు, స్నేహితుల మధ్య సంతోషంగా గడిపిన వారు తిరిగి పయనమయ్యారు. రిటర్న్ జర్నీతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. దీంతో రిటర్న్ జర్నీలో ప్రజలు నరకయాతన పడ్డారు.

ఆదివారం పుష్య బహుళ అమావాస్య అంతేకాదు సంక్రాంతి పండగ తర్వాత మాఘమాసం ముందు వచ్చే మౌనీ అమావాస్య కావడంతో చాలా మంది శనివారం సాయంత్రమే సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. మరికొందరు అమావాస్య వేళ ప్రయాణాలు మంచిది కాదని జర్నీని సోమవారానికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. దీంతో హైదరాబాద్ వచ్చే వాహనాలను అవసరమైన చోట్ల దారి మళ్లిస్తున్నారు అధికారులు. చిట్యాల, పెద్దకాపర్తి, కొర్లపహాడ్, పంతంగి టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉండటంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.

ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, గుంటూరు, ఒంగోలు నెల్లూరు నుంచి వచ్చే వాహనదారులు హైదరాబాద్ హైవే పైకి రావడంతో రద్దీ ఎక్కువైంది. రద్దీ ఏ మేరకు పెరిగిందంటే గుంటుపల్లి నుంచి ఇబ్రహీంపట్నం రింగు రోడ్ జంక్షన్ వరకూ దూరం ఉన్న 5 కిలోమీటర్లు ప్రయాణానికి గంటన్నర పట్టింది. అటు చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహానాలకు స్పెషల్ ట్యాగ్స్ ఉన్నా వాహనాలు ఒక్కొక్కటిగా నెమ్మడిగా కదిలాయి. పంతంగి టోల్ ప్లాజా జాతరను తలపించింది. మొత్తంగా కొన్ని గంటలు పట్టే సమయం కూడా వాహనాల రద్దీ నేపథ్యంలో మూడు నాలుగు గంటలు ఆలస్యమవుతుంది.

మొత్తంగా ఆదివారం కాకుండా సోమవారం కూడా జాతీయ రహదారిపై రద్దీ ఉండే అవకాశాలు లేకపోలేదు. దీంతో ప్రజలు రోడ్డుపైనే నరక యాతన అనుభవిస్తున్నారు. ఐదు రోజుల్లో ఇరువైపులా కలిపి మొత్తం 3.04 లక్షల వాహనాల రాకపోకలు సాగించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒక్కవైపే 2.4 లక్షల వాహనాలు వెళ్లినట్లు తెలిసింది. కాగా ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లు, సిసిటివిలతో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రయాణంలో అత్యవసరమైతే డయల్ 100ను సంప్రదించాలని తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం వాహనదారులు పోలీసుల సూచనలు పాటించి ఓర్పుతో ప్రయాణించాలని చెప్పారు. మరోవైపు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట దగ్గర జాతీయ రహదారిపై కార్ పల్టీ కొట్టింది. సంక్రాంతి పండుగ ముగించుకొని విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్తుండగా వాహనం ప్రమాదానికి గురైం ది. ట్రాఫిక్ అధికంగా ఉండడంతో పక్క నుంచి వెళ్లాలనే ప్రయత్నంలో అదుపుతప్పి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి కారు దూసుకుపోయింది ఈ ఘటనలో కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వాహన రద్దీ అధికంగా ఉన్న తరుణంలో సంయమనం పాటించాలని మరోవైపు అధికారులు కోరుతున్నారు.