Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్ బ్యూరో: రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిషృ్కతమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బయట తొలిసారిగా మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. సుమారుగా రెండుగంటల పాటు ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలోని హరిత హోటల్లో ఈ కీలక భేటీ జరిగింది. ఖమ్మంలో జరిగిన సిపిఐ బహిరంగ సభ ముగించుకొని సిఎం రేవంత్ రెడ్డి నేరుగా హెలీక్యాప్టర్‌లో మేడారం చేరుకున్నారు.

మేడారం చేరుకున్న సిఎంకు మంత్రులు ఘనస్వాగతం పలికారు. మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి, తొలుత అక్కడ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రులతో కలిసి నడుచుకుంటూ హరిత హోటల్‌కు వచ్చారు.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఈ కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. రాజధాని వెలుపల కేబినెట్ భేటీ నిర్వహిస్తుండటంతో పోలీసులు మేడారం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

భద్రత విషయంలో రాజీ పడకూడదు

మేడారం మహాజాతర భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన సిఎం, అక్కడ సిసి కెమెరాల పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. జాతరలో భద్రత కోసం వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ గురించి ఉన్నతాధికారులు ముఖ్య మంత్రికి వివరించారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రతా చర్యల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికా రులను సిఎం ఆదేశించారు.