Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్ : రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో దోచుకో దాచుకో పంచుకో అన్నట్లు ఉందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జి.జగదీష్‌రెడ్డి విమర్శించారు. గత వారం పది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో మీడియా రంగంలో చాలా విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నామని అన్నారు. దోచుకునే దాంట్లో పంచాయితీలు కనిపిస్తున్నాయని.. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య దోచుకున్న పంచాయతీ నడుస్తుందని ఆరోపించారు. ఈ గొడవ మంత్రి జూపల్లి కృష్ణారావు నుంచి మొదలైందని అన్నారు. రవాణా శాఖ మంత్రి తెలియకుండానే జిఒలు అమలవుతున్నాయని చెప్పారని, మంత్రి కొండా సురేఖ కూతురు స్వయంగా ముఖ్యమంత్రి పైన రెవిన్యూ మంత్రిపైన ఆరోపణలు చేశారని చెప్పారు. మరో మహిళ మంత్రి ఇసుక అక్రమరవాణా చేస్తున్నందుకు ఏకంగా పి.ఎను తొలిగించారని, సినిమా టికెట్ రెట్లు పెంచిన సంగతి తనకు తెలియదు అని మరో మంత్రి బహిరంగ చెప్పారని పేర్కొన్నారు.

తెలంగాణ భవన్‌లో ఆదివారం జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబు ఆయనలాగే ప్రగల్భాలు పలికితే తెలంగాణ ప్రజలు పాతరేశారని అన్నారు. చంద్రబాబుకు ఏ గతి అయితే పట్టిందో రేవంత్ రెడ్డికి అదే గతి పడుతుందని పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. దోచుకున్న డబ్బుల పంచాయతీలు రోజుకొకటి బయటపడుతున్నాయని మండిపడ్డారు. ఆఖరికి ఆ పార్టీ ఎంఎల్‌ఎలు సైతం ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక మీడియాలో మంత్రులు, అధికారుల మధ్య వీడియోలు వస్తాయి…మరో మీడియాలో ఇంకో రకమైన వీడియోలు వచ్చాయని అన్నారు.

ఒక్క నిమిషం ప్రజల కోసం ఆలోచిస్తున్న దాఖలాలు లేవని, దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు, పంచుకునేందుకు ఒకరీ ఒకరు సహకారం చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వదిలేసి నిచానికి దిగజారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒకరి దగ్గరకు వెళ్ళి కాళ్ళు మొక్కారని మండిపడ్డారు. పాత కాంగ్రెస్ నాయకులైన ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.