Reading Time: 2 minutes

పగలు రాహుల్ గాంధీ జపం.. రాత్రి బిజెపి, టిడిపి దోస్తీ

రేవంత్ రాజకీయ యాత్ర మొత్తం చంద్రబాబు కనుసన్నలలోనే సాగుతున్నది

బిఆర్‌ఎస్ దిమ్మెలు కూలగొడితే.. రేవంత్ దిమ్మతిరిగేలా బదులిస్తాం

మాజీ మంత్రి హరీష్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్: ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డిఎన్‌ఎలోనే ఉందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసననభా పక్ష ఉపనేత హరీష్‌రావు ఘాటు విమర్శలు చేశారు. అడుగడుగునా వెన్నుపోట్లు.. అనుక్షణం అబద్ధాలు.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో బిఆర్‌ఎస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను హరీష్‌రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అని, చంద్రబాబు తరపున ఎంఎల్‌ఎలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ‘ఓటుకు నోటు’ దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్‌టిఆర్ జన్మపర్యంతం ద్వేషించిన కాంగ్రెస్‌లో చేరి, నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టిడిపి ద్రోహి అని మండిపడ్డారు. సిఎం పదవి అనుభవిస్తూనే, కేంద్రంలోని బిజెపితో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. కంచె చేను మేసినట్టు తానే ముఖ్యమంత్రి అయి వుండీ, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ద్రోహి రేవంత్ అని మండిపడ్డారు.

అవినీతి దాహం, ప్రజా ద్రోహం.. వెరసి రేవంత్ రెడ్డి అంటూ ఘటు విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, బిజెపి సర్కార్‌ను వ్యతిరేకిస్తూ ఉంటే.. రేవంత్ మాత్రం బిజెపి ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టిడిపిపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనుక మతలబు ఏంటి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ శత్రువులైన బిజెపి, టిడిపి కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహారశైలి ఉందని అన్నారు. పగలు రాహుల్ గాంధీ జపం.. రాత్రి బిజెపి, టిడిపి దోస్తీ అని విమర్శించారు. రేవంత్ రాజకీయ యాత్ర మొత్తం గురువు చంద్రబాబు కనుసన్నలలోనే సాగుతున్నదని ఆరోపించారు. సోనియా గాంధీ ఇచ్చిన సిఎం పదవిని అనుభవిస్తూ.. కాంగ్రెస్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ కమలం చెంతన, కమలానికి కాపు కాస్తున్న బాబు చెంతన చేరడం రేవంత్ ద్రోహబుద్ధికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీ బిఆర్‌ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని, ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడం అంటే.. అది రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే అని పేర్కొన్నారు. ఇది నేరాన్ని ప్రోత్సహించడం కాదా..శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు బాధ్యత ఎటు పోయింది..? అని పశ్నించారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, శాంతి భద్రతలను కాపాడే హోం శాఖను నిర్వహిస్తున్న వ్యక్తి ఇంత బహిరంగంగా నేర చర్యలను, విద్వేషాలను రెచ్చగొడుతుంటే రాష్ట్ర డిజిపి ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. చట్టం అందరికీ ఒక్కటేనని నిరూపించే ధైర్యం పోలీస్ శాఖకు ఉందా..? అని నిలదీశారు. రాజకీయంగా ఎదుర్కోలేక, భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి సిఎం పిలుపునివ్వడం రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనం అని, ఇలాంటి చర్యలతో తెలంగాణలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బిఆర్‌ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మతిరిగేలా బదులిస్తామని హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో ప్రజల చేతనే గుణపాఠం నేర్పుతామని అన్నారు. ఈ హింసను ప్రేరేపించే సిఎం వ్యాఖ్యలపై తెలంగాణ డిజిపి తీసుకునే చర్యలేమిటి..? అని అడిగారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా లేక రేవంత్ రాజ్యాంగం నడుస్తోందా..? అని హరీష్‌రావు ప్రశ్నించారు.