
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకూ ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. నేషనల్ పార్క్ అడవుల్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌ఛార్జి సున్నం చంద్రయ్య ఎలియాస్ పాపారావు, నేషనల్ పార్క్ ఏరియా కమిటీ చీఫ్ దిలీప్ బెడ్జా ఉన్నారనే సమాచారంతో పోలీసు బలగాలు ఆపరేషన్ చేపట్టాయి.
శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ చీఫ్ దిలీప్ బెడ్జా సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు. ఓ మహిళ మావోయిస్టు సహా నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో దిలీజ్ బెడ్జా ఉన్నట్లు గుర్తించారు. అదే ప్రాంతంలో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఎకె 47, 303 రైఫిల్, ఇన్సాస్, రైఫిల్‌తో పాటు భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.