Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్- ఎ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏ.ఐ.ఎం.ఐ.ఎం) పార్టీ టిక్కెట్ పై పోటీ చేయాలనుకునే వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్నఅభ్యర్థులు క్రింద పేర్కొన్న నిబంధనలను పాటించవలసి ఉంటుందని తెలిపింది. దరఖాస్తు ఫారాన్ని ఏఐఎంఐఎం అధికారిక ఫేస్‌బుక్ పేజీ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని, దరఖాస్తును సరిగ్గా పూరించిన తర్వాత, దరఖాస్తుదారులు దానిని ఏఐఎంఐఎం పేరు మీద తీసిన రూ.3,000 తిరిగి చెల్లించబడని డిమాండ్ డ్రాఫ్ట్‌తో పాటుగా తమ సంబంధిత జిల్లా టౌన్ మజ్లిస్ అధ్యక్షుడికి సమర్పించాలని పార్టీ సూచించింది.

అలాగే దరఖాస్తులను సమర్పించడానికి ఈ నెల 20 చివరి తేదీగా పేర్కొంది. దరఖాస్తులు స్వీకరించే ఆయా పట్టణ పార్టీ అధ్యక్షులకు కూడా కొన్ని సూచనలు చేసింది. స్వీకరించిన దరఖాస్తులను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించింది. టౌన్ అధ్యక్షుడు కూడా పార్టీ ఫేస్ బుక్ పేజీ నుండి దరఖాస్తు ఫారమ్ను డౌన్‌లోడ్ చేసుకుని, ఆసక్తి గల అభ్యర్థులకు పంపిణీ చేయవచ్చునని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అభ్యర్థి పేరును ప్రకటించకూడదని సూచించింది. పూర్తి చేసిన అన్ని దరఖాస్తులను డిమాండ్ డ్రాఫ్ట్‌తో పాటుగా తప్పనిసరిగా పార్టీ ప్రధాన కార్యాలయం, దారుస్సలాం, హైదరాబాద్‌కు పంపించానలి పార్టీ ఆదేశించింది. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు పరిగణించబడవని తెలిపింది. అభ్యర్థుల తుది జాబితాను ఏ.ఐ.ఎం.ఐ.ఎం జాతీయ అధ్యక్షుడు, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటిస్తారని ఆ ప్రకటన స్పష్టం చేసింది.