
ప్రశంసించడం తెలంగాణకు గర్వకారణం
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రూపకల్పన చేసిన టిఎస్ ఐపాస్ విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని సాక్షాత్తు నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో ప్రశంసించడం తెలంగాణకు గర్వకారణమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కెసిఆర్ దార్శనికతకు ఈ గుర్తింపే నిలువెత్తు నిదర్శనమని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్ల కాలంలోనే దేశానికే పారిశ్రామిక దిక్సూచిగా మార్చడంలో టిఎస్ ఐపాస్ పోషించిన పాత్ర అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వ సంస్థే చెప్పడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను తొలగించి, సింగిల్ విండో విధానంలో కేవలం 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా టిఎస్ ఐపాస్‌ను రూపొందించామని గుర్తుచేశారు. అవినీతికి ఏమాత్రం తావులేని అత్యంత పారదర్శకమైన ఈ విధానాన్ని పదేళ్లపాటు చిత్తశుద్ధితో అమలు చేయడం వల్లే అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని వివరించారు. ఈ విధానం ద్వారా భారీ పరిశ్రమలతో పాటు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఇ) విభాగంలో రూ. 2.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా గౌరవప్రదమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని వ్యాఖ్యానించారు. ప్రపంచ దిగ్గజ సంస్థల నుండి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల వరకూ అందరూ తెలంగాణకు క్యూకట్టేలా పెట్టుబడిదారుల్లో కొండంత విశ్వాసాన్ని కల్పించిన విప్లవాత్మక విధానం తీసుకొచ్చి పదేళ్లు దాటినా నేటికి టిఎస్ ఐపాస్ ప్రతిష్ట నలుదిశలా మారుమోగుతూనే ఉందని అన్నారు.గతంలోనూ స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా కెసిఆర్ అమలు చేసిన రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీ -హబ్ వంటి వినూత్న కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లే, ఇప్పుడు టిఎస్ ఐపాస్‌కు కూడా లభించిందని తెలిపారు. ఇకనైనా కెసిఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే భ్రమల్లో బతికే అరాచక శక్తులు బుద్ధి తెచ్చుకుంటే మంచిదని.. జై తెలంగాణ..జై కెసిఆర్ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.
ప్రాజెక్టులు ప్రారంభం కావడం సంతోషదాయకం
కెసిఆర్ హయాంలో ప్రారంభమై, 90 శాతానికి పైగా పనులు పూర్తిచేసుకున్న రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభం కావడం పట్ల బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. 0.98 టిఎంసిల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన చనాక కొరాట బరాజ్ బిఆర్‌ఎస్ హయాంలోనే 95 శాతం పనులు పూర్తయ్యి, సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయ్యిందని పేర్కొన్నారు. దీనిలో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపొనెంట్‌తో కలిపి, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గల్లోని 89 గ్రామాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకుని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది అని గుర్తు చేశారు. అదేవిధంగా కెసిఆర్ హయాంలోనే సదర్‌మాట్ బరాజ్ 90 శాతం ప్రాజెక్టు పూర్తయ్యిందని,దీని నీటి నిల్వ సార్ధ్యం 1.58 టిఎంసిలు అని పేర్కొన్నారు. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుందని అన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ దశాబ్ది (2014-2023), నెర్రెలుబారిన ఈ నేలను దేశానికి ధాన్యాగారంగా మార్చిందని వ్యాఖ్యానించారు.