
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటి రామారావుకు అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం లభించింది. మంత్రిగా ఆయన హయాంలో చేసిన అసాధారణ కృషిని, తెలంగాణను ప్రపంచ పటంలో సమున్నత స్థాయిలో నిలిపిన తీరును గుర్తిస్తూ, అంతర్జాతీయ వేదికలపై తన ఆలోచనలను పంచుకోవాల్సిందిగా కెటిఆర్‌కు ఆహ్వానం అందింది. సాంకేతికత, పాలన, సుస్థిర అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన ప్రపంచవ్యాప్తంగా విద్యా, విధాన నిర్ణేత, వ్యాపార వేదికలపై బలమైన ముద్ర వేసింది.ఈ క్రమంలో, న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్(సిబిఎస్)లో 2026 ఏప్రిల్ 4న జరగనున్న 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్(ఐబిసి)లో ప్రసంగించాలని కెటిఆర్‌కు ఆహ్వానం అందించింది.ఈ సదస్సును నిర్వహించే విద్యార్థి విభాగం సౌత్ ఆసియా బిజినెస్ అసోసియేషన్(ఎస్‌ఎబిఎ) ఈ మేరకు ఆయనను ఆహ్వానించింది.
భారతదేశ వ్యాపార, ఆవిష్కరణ, విధాన నిర్ణయ రంగాలపై మేధోమథనం జరిగే ప్రపంచంలోని అత్యున్నత వేదికలలో ‘ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్’ ఒకటి. గత 21 ఏళ్లుగా న్యూయార్క్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం పోషిస్తున్న పాత్రపై చర్చించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రవాస భారతీయులకు ఒక వేదికగా నిలుస్తోంది. 2026 ఎడిషన్ కాన్ఫరెన్స్‌లో జెరోధా వ్యవస్థాపకులు నిఖిల్ కామత్ ప్రధాన వక్తగా వ్యవహరించనున్నారు. గతంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పాలో ఆల్టో నెట్‌వర్క్ సిఇఒ నికేష్ అరోరా, డ్రీమ్ 11 సహ వ్యవస్థాపకులు హర్ష్ జైన్ వంటి ప్రముఖులు ఈ వేదికపై ప్రసంగించారు. ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగే హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం అందగా, తాజాగా కొలంబియా బిజినెస్ స్కూల్ నుండి కూడా కెటిఆర్ ఆహ్వానం రావడం విశేషం.
గత ఏడాది కూడా ఆయన ఆక్స్‌ఫర్డ్ ఇండియా వీక్ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కెటిఆర్‌ను విశిష్ట వక్తగా ఆహ్వానించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజా సేవలో కెటిఆర్ చేసిన కృషి, భారతదేశ అభివృద్ధి పథంలో ఆయన పోషించిన పాత్రను ఈ సందర్భంగా వారు కొనియాడారు.