
- నన్ను హైదరాబాద్‌లో తిరగనివ్వనని దానం అంటున్నడు: పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే తన గొంతు నొక్కుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని హరీశ్ రావు డిమాండ్ చేసినా.. ఎందుకు వేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తనను హైదరాబాద్‌లో తిరగనివ్వనంటూ సభలోనే దానం నాగేందర్ హెచ్చరించారన్నారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారని తాను అడిగితే.. ఆయనే తనపైకి తుపాకీ ఎక్కు పెట్టినట్టు చూపించారని, ప్రతిగా తానూ అలాగే చేశానని చెప్పారు.
బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తనపై ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారని, మరి, సీఎం రేవంత్ రెడ్డి బడవ అని కేసీఆర్ గురించి మాట్లాడారని, దానిపై ఎందుకు ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయడం లేదని ప్రశ్నించారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కత్తులతో కోలాటం చేసి ఇంటికి వేలాడదీస్తామని మాట్లాడారని, దానిపై రిఫర్ చేయరా అని నిలదీశారు. అసెంబ్లీ పని దినాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.సంజయ్ అన్నారు. నాలుగైదు వారాలు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు.. ఇప్పుడు కేవలం 9 రోజులకు తగ్గిపోయాయన్నారు. అసభ్య, బూతు రాజకీయాలకే అధికారపక్షం ప్రాధాన్యం ఇస్తున్నదని విమర్శించారు.