
ఉగాది నాటికి సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. అన్ని రకాలుగా పూర్తి స్థాయి సౌకర్యాలతో ఉగాది నాటికి రోగులకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు పనులను మంగళవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రి భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఎలక్ట్రికల్ పనులు కొన్ని ఇంకా చేయాల్సి ఉందని అన్నారు. ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్, ఇతర పరికరాల ఏర్పాటు చివరి దశలో ఉందని చెప్పారు. ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎంఆర్‌ఐ వంటి భారీ యంత్రాలను అమర్చడం పూర్తయిందని పేర్కొన్నారు. తమకు ప్రచార ఆర్భాటం ఉండదు అని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే తమ ఆరాటం అని వ్యాఖ్యానించారు.
వెయ్యి పడకల ఈ ఆసుపత్రిలో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా సనత్‌నగర్ టిమ్స్ ఉంటుందని, ఇక్కడే అవసరమైన పరిశోధనలు జరుగుతాయని తెలిపారు. సనత్‌నగర్ టిమ్స్‌లోనే అత్యాధునిక ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, అన్ని రకాల అవయవమార్పిడి శస్త్రచికత్సలు చేసేలా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో తెస్తున్నామని వివరించారు. ఆరోగ్యశాఖలో గత రెండేళ్లలోనే సుమారు 10 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇంకో 7 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ అవుతున్నాయని చెప్పారు. మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ఎలాంటి కొరత ఉండదని మంత్రి తెలిపారు.