
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం లభించేలా గెలల (ఫ్రెష్ ఫ్రూట్ బంచ్) ధరలు పెరిగినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు టన్నుకు రూ.21,546 గా ఉన్న ధర.. రూ.1,459 పెరిగి ప్రస్తుతం రూ.23,005కు చేరుకున్నట్లు వెల్లడించారు. ఈ ధరల పెరుగుదలతో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశముందని చెప్పారు. ధరల పెరుగుదల రైతుల్లో విశ్వాసాన్ని పెంచడమే కాకుండా, మరింత మంది రైతులు ఆయిల్ పామ్ పంట వైపు ఆకర్షితులవుతారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ఇప్పటికే పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. ఉచితంగా మొక్కల పంపిణీ, డ్రిప్ సౌకర్యం, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు అమలులో ఉన్నాయని వివరించారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం అందించే పంటగా ఆయిల్ పామ్ నిలుస్తోందని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సాగు విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సాంకేతిక మార్గదర్శకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులను మంత్రి తమ్మల కోరారు.