
- మే నెలలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఒకట్రెండు రోజులు హీట్ వేవ్స్
- ఏప్రిల్‌లో రాష్ట్రమంతటా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం
- ఐఎండీ ‘మంత్లీ సమ్మర్ ఔట్లుక్’ నివేదికలో వెల్లడి
- రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఎండాకాలం ఎండల ప్రభావం మామూలుగానే ఉండబోతున్నది. ఈ వేసవిలో రాష్ట్రమంతటా సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది. అయితే, ఏప్రిల్ నెలలో మాత్రం ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో టెంపరేచర్లు కొంచెం ఎక్కువగా ఉంటాయని, మిగతా జిల్లాల్లో సాధారణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండాకాలం పరిస్థితులపై ఐఎండీ ఈ మేరకు నెలవారీ నివేదికను విడుదల చేసింది.
ఈ ఏడాది రాష్ట్రంలో హీట్‌వేవ్స్ ఉండవని నివేదికలో పేర్కొంది. అయితే, పొరుగు రాష్ట్రం ఏపీలో మాత్రం హీట్‌వేవ్స్ పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలపై ఎఫెక్ట్ ఉంటుందని, దాని ప్రభావం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై స్వల్పంగా పడే అవకాశం ఉందని.. అది కూడా మే నెలలో ఒకట్రెండు రోజులే ఉండొచ్చని ఐఎండీ మ్యాప్స్ ద్వారా తెలుస్తున్నది. ఇక ఏప్రిల్‌లో రాష్ట్రంలో వర్షపాతం సగటు కన్నా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. 39.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కాగా.. అంతకన్నా ఎక్కువ వర్షాలు పడతాయని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 50 నుంచి 70 మిల్లీమీటర్ల దాకా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే ఉంటాయని ఐఎండీ తెలిపింది.
ప్రస్తుతానికి ఎల్‌నినో ముప్పు లేదని వెల్లడించింది. పసిఫిక్ మహా సంద్రంలో ప్రస్తుతం ఎల్‌నినో న్యూట్రల్‌గానే ఉందని తెలిపింది. జూన్ వరకు న్యూట్రల్ పరిస్థితులే ఉంటాయని, ఆ తర్వాత ఎల్‌నినో క్రమంగా బలపడే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇటు హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ (ఎల్‌నినో లాంటి పరిస్థితులు) న్యూట్రల్‌గానే ఉందని, వర్షాకాలం మొత్తం న్యూట్రల్‌గానే ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది.
రాష్ట్రంలో నాలుగు రోజులు వానలు..
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. గురువారం నుంచి శనివారం వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలు, ఆదివారం మధ్య తెలంగాణలోని నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరించింది. పలుచోట్ల వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే (40 డిగ్రీలలోపే) నమోదవుతాయని తెలిపింది.