Reading Time: < 1 minute

ఇంటర్మీడియెట్‌‌‌‌‌‌‌‌ విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దు

Caption of Image.
  • ప్రభుత్వ సలహాదారు కేకేకు ఇంటర్‌‌‌‌‌‌‌‌ విద్యా జేఏసీ వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దశాబ్దాలుగా ఎందరో మేధావులు, నిపుణులను తీర్చిదిద్దిన ఇంటర్మీడియెట్‌‌‌‌‌‌‌‌ విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని, దాన్ని నాశనం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని ఇంటర్‌‌‌‌‌‌‌‌ విద్యా జేఏసీ ప్రభుత్వానికి విన్నవించింది. బుధవారం ఇంటర్‌‌‌‌‌‌‌‌ విద్యా జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర  ప్రభుత్వ సలహాదారు, విద్యా విధాన రూపకల్పన కమిటీ చైర్మన్  కె.కేశవరావుతో భేటీ అయింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో ఇంటర్మీడియట్‌‌‌‌‌‌‌‌ విద్య ఆవశ్యకత, ప్రస్తుత స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు.1968 నాటి కొఠారి కమిషన్‌‌‌‌‌‌‌‌ సిఫార్సుల మేరకు, నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి పీవీ నరసింహారావు కృషితో 10+2+3 విద్యా విధానం అమల్లోకి వచ్చిందని జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గుర్తు చేశారు.

ఈ వ్యవస్థ ద్వారా ఎందరో ఇంజినీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఐఏఎస్‌‌‌‌‌‌‌‌, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ అధికారులు తయారయ్యారని వివరించారు. కేవలం పదో తరగతి నుంచి ఇంటర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే సమయంలో విద్యార్థులు డ్రాపౌట్‌‌‌‌‌‌‌‌ అవుతున్నారనే సంకుచిత దృక్పథంతో వ్యవస్థను మార్చాలని చూడటం విడ్డూరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 430 సర్కారు జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య ఆశాజనకంగా ఉన్న వాస్తవాన్ని విస్మరించి, కొందరు అధికారులు అత్యుత్సాహంతో వ్యవస్థను ఏమార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేత కళింగ కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.