Reading Time: 2 minutes
ఏదీ వదలట్లేదు.. ఫుడ్ కల్తీలో హైదరాబాద్‌ టాప్‌..!  ఇది కల్తీరాయుళ్ల కన్నింగ్ రూపం..!

తినేది, తాగేది, చివరకు పీల్చే గాలి కూడా కల్తీనే. మనుషుల ఆరోగ్యాలపై వికృత ప్రయోగాలు చేస్తూ.. కాసులకు కక్కుర్తిపడి.. కల్తీ మహమ్మారిని విస్తరిస్తున్నారు కేటుగాళ్లు. నిన్నటి మంగళ్‌హాట్ మటన్‌ డెన్‌ల మాదిరి.. హైదరాబాద్‌ ఫేమస్‌ ఉస్మానియా బిస్కెట్‌నూ కల్తీ చేశారు. అంబర్‌పేటలో ఈ కల్తీ ఉస్మానియా బిస్కెట్‌ దందా బట్టబయలైంది. కుళ్లిన కోడి గుడ్లు, కెమికల్స్‌, సింథటిక్‌ కలర్స్‌తో బిస్కెట్లు తయారు చేస్తున్నారు కల్తీగాళ్లు. అంతేకాదు, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బిస్కెట్లు ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగులు కలుపుతూ… జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

మైలార్‌దేవ్‌పల్లిలో కల్తీ కేక్‌లు, డొనట్స్‌, బన్స్‌కి చెక్‌పెట్టారు HFAST అధికారులు. కుళ్లిన కోడిగుడ్లు, కెమికల్‌ పౌడర్లు, ఎక్స్‌పైరీ అయిన పదార్థాలతో వీటిని తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 150 కేజీల కల్తీ డోనట్ కేక్స్, 20 కేజీల బేకింగ్ పౌడర్, 120 కేజీల వనస్పతి, 330 కుళ్లిపోయిన గుడ్లు, 25 కేజీల నకిలీ మిల్క్ పౌడర్, సింథటిక్ కలర్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు కల్తీగాళ్లను అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించారు.

ఇటు అత్తాపూర్‌లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీకి చెక్‌పెట్టారు అధికారులు. ముగ్గుర్ని అరెస్ట్‌చేసి.. డెక్కన్ ట్రేడర్స్ గోడౌన్లలో 70 క్వింటాళ్ల కల్తీ పేస్ట్, ప్రమాదకర రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అత్తాపూర్‌లోనే కెమికల్‌ ఐస్‌క్రీమ్స్‌ తయారు చేస్తున్న కేటుగాళ్లను పట్టుకున్నారు. నాసిరకం పదార్థాలు, రసాయనాలతో ఐస్‌క్రీమ్స్‌ తయారు చేస్తున్న ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. దాడుల్లో మొత్తం 3,759 ఐస్‌క్రీమ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సింథటిక్‌ కలర్స్‌, గడువు ముగిసిన ఫ్లేవర్ బాటిళ్లను సీజ్ చేశారు.

రోజూ సాయంత్రం లొట్టలేసుకుని తినే సమోసాల వెనక భయంకరమైన వాస్తవాలను బయటపెట్టారు H-FAST అధికారులు. కుళ్లిపోయిన కోడిగుడ్లు.. కుళ్లిపోయిన ఆనియన్స్, ఆలుగడ్డలు, స్వీట్‌కార్న్‌, కూరగాయలు, పురుగులు పట్టిన మైదా, ఇంజిన్‌ ఆయిల్‌లాంటి నూనెతో సమోసాల్ని తయారు చేస్తున్నట్టు తేల్చారు. జియాగూడలోని ఓ సమోసా తయారీ కేంద్రంలో ఈ భయంకరమైన సీన్లు కనిపించాయి. మూసీ ఒడ్డున.. మురికి కూపంలో వాటిని తయారు చేయడాన్ని చూసి అధికారులే షాకయ్యారు. 500 పాడైన గుడ్లు, ఐదు కిలోల కల్తీ నూనె, 350 ఎగ్‌ సమోసాలు, 600 స్వీట్‌కార్న్ సమోసాలు, వెయ్యికిపైగా ఆనియన్‌ సమోసాలను సీజ్ చేశారు.

అలాగే.. అంబర్‌పేట్‌, రహామత్‌నగర్‌లో 2వేల 500 కేజీల కల్తీ పెరుగుతో పాటు దాని తయారీకి ఉపయోగించే ప్రమాదకర రసాయన పదార్ధాలను సీజ్ చేశారు. అత్యంత అనారోగ్యకరమైన పరిస్థితుల్లో పెరుగును తయారు చేస్తు్న్నారు నిర్వాహకులు. NR ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో 6 నెలలుగా ఈ కల్తీ పెరుగు తయారీ జరుగుతోంది. పెరుగే కాదు.. పన్నీరు కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. మహంకాళి PS పరిధిలో 3 వేల కేజీల కల్తీ పన్నీర్ సీజ్‌ చేశారు. శ్రీ బాలాజీ డెయిరీలో 16 వందల కిలోలు.. విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్‌లో 1000 కేజీల కల్తీ పన్నీర్ స్వాధీనం చేసుకున్నారు.

గచ్చిబౌలి పరిధిలో భారీగా కల్తీ నూనె, 5 టన్నుల కల్తీ గోధుమపిండి పట్టుబడింది. వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో కాలం చెల్లిన నూనెలు సేకరించి రీప్యాకింగ్ చేస్తున్న ముఠాను అరెస్ట్‌ చేశారు. గోల్డ్ ఫేస్‌ లైట్, రాజ్‌ గోల్డ్, గోల్డ్ డ్రై, గోల్డ్‌ ఫ్రెష్‌, హెల్త్ కేర్, నంది ప్యూర్‌ పేరిట విక్రయాలు చేస్తున్న రాజస్థాన్‌ ముఠా ఆటకట్టించారు. ఇక కుళ్లిన చికెన్, మటన్‌ ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట బయటపడుతూనే ఉంది.

సో… ఇవన్నీ చూసైనా మేల్కోకపోతే ప్రాణాలు పోవడం పక్కా. అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దు.. డబ్బాల్లో తెచ్చి పోసే పాలు, ప్యాకింగ్‌ లేని పనీర్, నెయ్యితో జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు. ప్లాస్టిక్‌ కవర్లల్లో ఎలాంటి లేబుళ్లు లేని వాటిని కొనొద్దు.. బీ కేర్ ఫుల్ అని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..