Reading Time: 3 minutes

హార్మూజ్ ను రీఓపెన్ చేస్తేనే..కాల్పుల విరమణ.. అప్పటివరకూ ఇరాన్ పై దాడులు ఆపేదే లేదు: ట్రంప్

Caption of Image.
  • యుద్ధాన్ని రెండు వారాల్లో ముగిస్తానన్న కొన్ని గంటల్లోనే మారిన మాట  
  • ఇరాన్ నుంచి త్వరగా వచ్చేస్తం.. అవసరమైతే మెరుపు దాడులు చేస్తం
  • ఇరాన్ సీజ్ ఫైర్ కోరుకుంటోందని వెల్లడి
  • నాటో నుంచి వైదొలిగేందుకూ యోచిస్తున్నానని కామెంట్ 
  • కొనసాగిన దాడులు, ప్రతి దాడులు

టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిగా తెరిచినప్పుడే ఇరాన్‌‌‌‌‌‌‌‌పై దాడుల నిలిపివేతను పరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. “హార్మూజ్ జలసంధి ఎప్పుడు స్వేచ్ఛగా ఓపెన్ అవుతుందో అప్పుడు కాల్పుల విరమణను పరిశీలిస్తాం. అప్పటివరకూ ఇరాన్‌‌‌‌‌‌‌‌పై దాడులు చేస్తూనే ఉంటాం” అని బుధవారం ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ “ప్రభుత్వ కొత్త అధ్యక్షుడు” అమెరికాను యుద్ధ విరమణ కోరారని బుధవారం ఒక సోషల్ మీడియా పోస్ట్‌‌‌‌‌‌‌‌లో ట్రంప్ పేర్కొన్నారు. 

కొన్ని గ్యారంటీలతో ఈ యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అమెరికా ప్రెసిడెంట్ గుర్తుచేశారు. హార్మూజ్​ను తెరవకపోయినా, ఎలాంటి ఒప్పందం లేకపోయినా తాము సాధ్యమైనంత త్వరగా ఈ వివాదం నుంచి బయటపడాలని ఆశిస్తున్నట్లు చెప్పిన గంటల వ్యవధిలోనే ట్రంప్ మాట మార్చడం గమనార్హం.  “ఇజ్రాయెల్, అమెరికా దళాలు కలిసి ఇప్పటికే ఇరాన్‌‌‌‌‌‌‌‌ను బలహీనపరిచాయి. వారు నాతో ఒప్పందం చేసుకోవాల్సిన పని లేదు” అని ఆయన మంగళవారం వైట్​హౌస్‌‌‌‌‌‌‌‌లో జరిగిన సమావేశంలో ప్రకటించారు. 

“మేం చాలా త్వరగా అక్కడి నుంచి వచ్చేస్తాం. బహుశా రెండు లేదా మూడు వారాల్లోనే ఇది జరగొచ్చు” అని వెల్లడించారు. దీంతో యుద్ధం ముగింపునకు ఒప్పందం అవసరం లేదని ఒకవైపు చెబుతూనే, మరోవైపు జలసంధిని తెరవాలని షరతు విధించడం అంతర్జాతీయంగా గందరగోళానికి దారితీసింది. మరోవైపు ఇరాన్ బుధవారం కూడా పశ్చిమాసియా అంతటా క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్, అమెరికా కూడా ఇరాన్‌‌‌‌పై బాంబు దాడులను కొనసాగించాయి.

ఇరాన్ సీజ్​ఫైర్ కోరుకుంటోంది.. 

ఇరాన్ కొత్త నేత తన పూర్వీకుల కంటే “తక్కువ ఛాందసవాది” అని, “చాలా తెలివైనవాడు” అని ట్రంప్ అభివర్ణించారు. ఇరాన్ స్వయంగా అమెరికాను యుద్ధ విరమణ కోరిందని తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు. అయితే, హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచి, నౌకల రవాణా సాఫీగా కొనసాగితేనే శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. “అప్పటివరకు ఇరాన్‌‌‌‌ను నామరూపాలు లేకుండా చేస్తాం.. లేదా వారు చెప్పుకునేటట్టుగా వారిని తిరిగి రాతియుగంలోకి నెట్టేస్తాం” అని ఆయన హెచ్చరించారు.

అవసరమైతే మళ్లీ మెరుపు దాడులు.. 

ఇరాన్ నుంచి అమెరికా దళాలు “చాలా త్వరగా” బయటకు వస్తాయని, కానీ అవసరమైతే మాత్రం మళ్లీ వెనక్కి వచ్చి “మెరుపు దాడులు”  చేస్తామని ట్రంప్ బుధవారం ప్రకటించారు. నాటో నుంచి అమెరికాను తప్పించే అంశాన్ని కూడా తాను “ఖచ్చితంగా” పరిశీలిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. “ఇరాన్ ఇప్పుడు అణ్వాయుధాన్ని తయారు చేసే సామర్థ్యాన్ని కోల్పోయింది. అందుకే నేను అందరినీ తీసుకుని వచ్చేస్తాను. ఒకవేళ అవసరమనిపిస్తే మళ్లీ వచ్చి మెరుపు దాడులు చేస్తాం” అని అన్నారు. 

మరోవైపు అమెరికా తన భూతల దళాలను పశ్చిమాసియాలో భారీగా మోహరిస్తూనే ఉంది. మూడవ విమాన వాహక నౌక వర్జీనియా నుంచి పశ్చిమాసియాకు బయలుదేరింది.  ఇరాన్ వ్యవహారంపై బుధవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) అమెరికన్ లను ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించనున్నారు. వైట్​హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ దీనిని ధ్రువీకరిస్తూ, అధ్యక్షుడు ఇరాన్ విషయంలో ఒక “కీలకమైన సమాచారాన్ని” అందిస్తారని తెలిపారు.

శత్రువులకు హార్మూజ్ మూసే ఉంది: అరాఘ్చీ

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. “ఇరాన్ ప్రజలతో బెదిరింపుల భాషలో, గడువుల పేరుతో మాట్లాడటం కుదరదు. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు ఎటువంటి గడువులు లేవు” అని అల్ జజీరా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాము పోరాటాన్ని కొనసాగిస్తామని, యుద్ధ విరమణను అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి ఇరాన్, ఒమన్ ప్రాదేశిక జలాల్లో ఉందని, దీనిని వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే హక్కు తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. “మాతో యుద్ధం చేస్తున్న దేశాల నౌకలకు మాత్రమే ఈ జలసంధిని మూసివేశాం. 

యుద్ధ సమయంలో ఇది సహజం. మా శత్రువులు మా ప్రాదేశిక జలాలను వాణిజ్యం కోసం వాడుకోవడానికి అనుమతించలేం” అని ఆయన ప్రెస్ టీవీతో చెప్పారు. అమెరికా మధ్యవర్తి స్టీవ్ విట్‌‌‌‌కాఫ్ నుంచి తనకు నేరుగా సందేశాలు అందుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, ఇవి కేవలం సందేశాలు మాత్రమేనని, చర్చలు కావని ఆయన తేల్చి చెప్పారు. “అమెరికాతో చర్చల వల్ల ఫలితం ఉంటుందనే నమ్మకం మాకు లేదు. మా మధ్య విశ్వాసం సున్నా స్థాయిలో ఉంది” అని ఆయన అన్నారు. అమెరికా ఒకవేళ భూతల దాడులకు దిగితే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అరాఘ్చీ హెచ్చరించారు. “మేము వారి కోసం వేచి చూస్తున్నాం. భూతల యుద్ధంలో మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలో మాకు బాగా తెలుసు. అమెరికా అటువంటి తప్పు చేయదని భావిస్తున్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు.

పెరుగుతున్న మరణాలు.. ఆర్థిక సంక్షోభం 

ఈ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 4,950 మంది మరణించారు. ఇందులో మూడొంతుల మంది ఇరాన్ వాసులే ఉన్నారు. మరోవైపు లెబనాన్‌‌‌‌లో ఇజ్రాయెల్ జరుపుతున్న పోరాటంలో 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు ధరలు 40 శాతం పెరిగాయి. అమెరికాలో గాలన్ పెట్రోల్ ధర 4 డాలర్లు దాటడం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందిగా మారింది. 

మరోవైపు మంగళవారం ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఈ సంక్షోభం ముగింపునకు చేరుకోవచ్చనే సంకేతాలతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. చమురు ధరలు వారం రోజుల్లో మొదటిసారి 100 డాలర్ల కంటే తగ్గినా, యుద్ధం ప్రారంభానికి ముందు ఉన్న ధరల కంటే ఇంకా 40 శాతం ఎక్కువే ఉన్నాయి.

ఖతార్ జలాల్లో ఆయిల్​ ట్యాంకర్‌‌‌‌పై క్షిపణి దాడి  

ఇరాన్ ప్రయోగించిన మూడు క్రూయిజ్ క్షిపణులు బుధవారం ఖతార్ లక్ష్యంగా దూసుకువచ్చాయని, అందులో ఒక క్షిపణి ఖతార్ ప్రాదేశిక జలాల్లోని ఆయిల్ ట్యాంకర్‌‌‌‌ను తాకిందని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. ఖతార్ ఎనర్జీ సంస్థ అద్దెకు తీసుకున్న ఈ ట్యాంకర్‌‌‌‌పై దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, అందులోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా ఖాళీ చేయించాయి. మిగిలిన రెండు క్షిపణులను ఖతార్ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఇరాన్ కేవలం ఖతార్‌‌‌‌నే కాకుండా ఇతర పొరుగు దేశాలనూ లక్ష్యంగా చేసుకుంటోంది. 

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకుపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో భారీగా మంటలు చెలరేగాయి. దుబాయ్ తీరంలో కూడా కువైట్‌‌‌‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌‌‌‌పై దాడి జరిగింది. బహ్రెయిన్ లో ఇరాన్ క్షిపణి దాడి కారణంగా ఒక వ్యాపార సముదాయంలో అగ్నిప్రమాదం సంభవించింది. సౌదీ అరేబియాలో రెండు డ్రోన్లను రక్షణ దళాలు కూల్చివేశాయి. ఇజ్రాయెల్ లో దేశవ్యాప్తంగా సైరన్లు మోగినప్పటికీ, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇరాక్‌‌‌‌లోని కుర్దిస్థాన్ ప్రాంత రాజధాని ఎర్బిల్‌‌‌‌లో ఉన్న ఒక బ్రిటీష్ మోటార్ ఆయిల్ కంపెనీపై బుధవారం ఉదయం డ్రోన్లు దాడి చేశాయి. ఈ దాడి వల్ల అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.

©️ VIL Media Pvt Ltd.