Reading Time: < 1 minute

సైబర్ నేరగాళ్ల సరికొత్త దోపిడి వెలుగు చూసింది. అమాయకులనే లక్షంగా రోజుకో కొత్త తరహ దోపిడీకి సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలో నకిలీ ఈ-చలాన్ లింక్‌పై క్లిక్ చేసిన ఒక వ్యక్తి దాదాపు రూ.6 లక్షలు పోగొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. నకిలీ ట్రాఫిక్ ఈ-చలాన్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ఈ నకిలీ వెబ్‌సైట్ కూడా ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లాగే ఉంటుందని వెల్లడించారు. పోర్టల్ అలాగే ఉండటంతో బాధితుడు రూ.500 ట్రాఫిక్ ఫైన్ చెల్లించడానికి ప్రయత్నించి డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిపారు. సైబర్ నేరగాళ్లు అతని క్రెడిట్ కార్డు నుంచి అంతర్జాతీయ లావాదేవీల ద్వారా డబ్బులు కాజేశారు. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరించారు. ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చే లింకుల ద్వారా ఎప్పుడూ జరిమానాలు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎల్లప్పుడూ అధికారిక ఈ-చలాన్ వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా సజ్జనార్ సూచించారు.