Reading Time: 2 minutes
Cigarette Pan Masala Price Hike New Tax Excise Duty India

Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. నేటి నుంచి సిగరెట్‌, పాన్‌మసాలా, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, పొగాకు వాడకాన్ని తగ్గించటం లక్ష్యంగా ఈ మార్పులు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇంతవరకు ఈ ఉత్పత్తులపై 28 శాతం పన్నుతో పాటు జీఎస్టీ వచ్చినప్పుడు పెట్టిన ప్రత్యేక పరిహార పన్ను ఉండేది. ఇప్పుడు ఆ విధానం మార్చారు. జీఎస్టీతో పాటు కొత్తగా ఎక్సైజ్ డ్యూటీని మళ్లీ అమలు చేశారు. పాన్‌మసాలా, గుట్కాలపై ఆరోగ్య, జాతీయ భద్రత పేరుతో కొత్త సెస్‌ను సైతం విధించారు.

READ MORE: IND vs PAK U19: సూపర్ సిక్స్‌లో హై వోల్టేజ్ పోరు.. నేడే దాయాదుల పోరు.. వర్షం పడే అవకాశం!

సిగరెట్ల విషయంలో కొత్త పన్నులు సిగరెట్ పొడవు, రకం బట్టి ఉంటాయి. చిన్న సైజు, ఫిల్టర్ లేని సిగరెట్లకు ఒక్క స్టిక్‌పై సుమారు రూ.2.05 పన్ను పడుతుంది. అదే పొడవు ఉన్న ఫిల్టర్ సిగరెట్లపై రూ.2.10 వరకు ఉంటుంది. మధ్య సైజు సిగరెట్లకు ఒక్కదానికి దాదాపు రూ.4, పొడవైన సిగరెట్లకు రూ.5.40 వరకు ఎక్సైజ్ డ్యూటీ వేస్తారు. వెయ్యి సిగరెట్లపై చూస్తే ఈ పన్ను రూ.2,050 నుంచి రూ.8,500 వరకు ఉంటుంది. కొన్ని రకాలపై అయితే రూ.11,000 వరకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మార్పులతో సిగరెట్లపై మొత్తం పన్నుల భారం భారీగా పెరుగుతుంది. ఇంతవరకు సుమారు 50 నుంచి 55 శాతం ఉన్న పన్ను, ఇప్పుడు 60 నుంచి 70 శాతం వరకు చేరే అవకాశం ఉంది. ఇప్పుడున్న ధరలు చూస్తే ఒక్క సిగరెట్‌ సుమారు రూ.18 ఉంటుంది. కానీ కొత్త పన్నుల ప్రభావంతో భవిష్యత్తులో అదే సిగరెట్‌ ధర రూ.70 నుంచి రూ.72 వరకు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సిగరెట్లతో పాటు ముడి పొగాకుపై కూడా భారీ పన్ను పడుతుంది. దీనిపై 60 నుంచి 70 శాతం ఎక్సైజ్ డ్యూటీ వేశారు. ఈ-సిగరెట్లు, నికోటిన్ ఉన్న ఇతర ఉత్పత్తులపై అయితే నేరుగా 100 శాతం పన్ను విధించారు. పాన్‌మసాలా, గుట్కా వంటి వాటిపై కొత్తగా ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ కూడా అదనంగా చెల్లించాలి. ప్రభుత్వం చెప్పే ప్రధాన ఉద్దేశం ఒక్కటే. పొగాకు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించటం, ప్రజలను పొగ తాగడం మానేయాలనే దిశగా ప్రోత్సహించటం. ధరలు పెరిగితే అలవాటు తగ్గుతుందన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొంతమంది నిపుణులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు మరీ ఎక్కువగా పెరిగితే ప్రజలు చట్టబద్ధమైన సిగరెట్లకు బదులుగా చౌకగా దొరికే అక్రమ, స్మగ్లింగ్ సిగరెట్ల వైపు మొగ్గు చూపవచ్చని వారు అంటున్నారు.