Reading Time: 2 minutes

సలసల కాగుతున్న వంట నూనె ధరలు: యుద్ధం తర్వాత లీటర్‌కు రూ.30 పెరిగాయి..!

Caption of Image.

యుద్ధం.. యుద్ధం.. దీని దుంపతెగ.. నిన్నా మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్ కంగారు పుట్టించింది.. గ్యాస్ సంగతి అయితే చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వంట నూనెల వంతు వచ్చేసింది. ఏ ముహూర్తాన యుద్ధం మొదలైందో.. ఈ నెల రోజుల్లోనే.. 2026, మార్చి నెలలోనే లీటర్ ఆయిల్ ప్యాకెట్ పై ఏకంగా 30 రూపాయల వరకు పెరిగింది. సలసల కాగుతున్న వంట నూనె ధరలు సామాన్యుడి నిత్యావసరాల బడ్జెట్ ను అమాంతం పెంచేస్తుంది. ఇప్పటికే గ్యాస్ ధర పెంచారు.. ఇప్పుడు వంట నూనె ధరలు అమాంతం పెరుగుతున్నాయి.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని పెరగనున్నాయో అనేది టెన్షన్ అందరిలో నెలకొంది. ఇంతకీ యుద్ధానికి వంట నూనెకు లింగ్ ఏంటో పూర్తిగా తెలుసుకుందామా..

గల్ఫ్ యుద్ధం ఇప్పటికే ఎల్‌పీజీ సిలిండర్ ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను దెబ్బతీయగా, ఇప్పుడు వంట నూనె వంతు వచ్చింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం దాదాపు 10 శాతం తగ్గే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేస్తోంది. 

మార్చి నెల ప్రారంభం నుంచే వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ మార్చి 1న లీటరు రూ.140 ఉండగా.. మార్చి 31 నాటికి రూ.185కు చేరింది. ఇక పామ్ ఆయిల్ విషయానికి వస్తే లీటరు రూ.117 నుండి రూ.160కి ఎగబాకింది. ఈ భారీ పెరుగుదల అటు మధ్యతరగతి, ఇటు పేద కుటుంబాల నెలవారీ ఖర్చులపై భారంగా మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 170-175 మధ్య పలుకుతుండటంతో వినియోగదారులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.

ALSO READ : Xలో వీడియో లింక్ కాపీ ఆప్షన్ తీసేశారా ? అసలు నిజమేంటంటే..

అసలు ఎందుకీ సంక్షోభం?
భారత్‌కు అవసరమైన సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఎక్కువ భాగం ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి అవుతుంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరుకు రవాణా నౌకలు సురక్షితం కాదని భావించి.. కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా సుదీర్ఘ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ప్రయాణ దూరం, సమయం పెరగడమే కాకుండా వార్-రిస్క్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా భారంగా మారాయి షిప్పింగ్ కంపెనీలకు. ఈ అదనపు లాజిస్టిక్స్ ఖర్చులన్నీ చివరికి వినియోగదారుడి జేబుకే చిల్లు పెడుతున్నాయి.

ధరల భారం తట్టుకోలేక చాలామంది సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు బదులుగా రైస్ బ్రాన్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వైపు మళ్లుతున్నారు. ఇవి సన్‌ఫ్లవర్ ఆయిల్ కంటే లీటరుకు రూ.10 నుండి రూ.20 వరకు తక్కువ ధరకే దొరుకుతుండటం ఇందుకు ప్రధాన కారణం. వంటనూనెల తయారీ కంపెనీలు తమ పాత స్టాక్ ద్వారా లాభాలను కాపాడుకుంటున్నప్పటికీ, సామాన్యుడికి మాత్రం తక్కువ ధరలో నూనె దొరకడం కష్టమైంది. యుద్ధం సద్దుమణిగి సరఫరా వ్యవస్థలు సాధారణ స్థితికి వస్తే తప్ప వంటింట్లో ఈ మంటలు తగ్గేలా లేవని వ్యాపారులు చెబుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.