
నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత సోమవారం (మార్చి 30న) కన్నుమూశారు. అనంతరం, మార్చి 31న బెంగళూరులోని ఒక చర్చిలో క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ తీవ్ర భావోద్వేగంతో కనిపించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
అయితే, సామాజిక మరియు రాజకీయ అంశాలపై తరచుగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉండే ప్రకాశ్ రాజ్, తాను నాస్తికుడని గతంలో పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారు. గతంలో తాను ‘నాస్తికుడు’ (atheist) అని చెప్పిన ఓ ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేస్తూ, క్రైస్తవ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు.
ఈ విమర్శలకు స్పందిస్తూ, ట్రోలర్స్కి ప్రకాష్ రాజ్ X వేదికగా గట్టి సమాధానమిచ్చాడు. “నేను దేవుడిని నమ్మను. కానీ నా తల్లి తన దేవుడిని నమ్మింది. ఆమె విశ్వాసాన్ని గౌరవించడం నా బాధ్యత. ఆమె నమ్మకానికి అనుగుణంగా అంత్యక్రియలు చేయడంలో తప్పేంటి? ఇది మనం ఒకరికొకరు ఇచ్చే కనీస గౌరవం” అని X వేదికగా ట్వీట్ చేశారు. క్రమంలోనే తనపై వస్తోన్న ట్రోల్స్‌ను “ద్వేషాన్ని నింపుకున్న మీలాంటి రాక్షసులకు ఇది అర్థమవుతుందా” (hate-mongering monsters?) అంటూ ప్రకాష్ రాజ్ విమర్శించారు.
ALSO READ : నన్ను తొక్కేయాలని చూస్తున్నారు.. నాకు న్యాయం కావాలి..
Yes. I don’t believe in god .. but my mother believed in her god . Who am i to deny her .. the right to be buried according to her belief. This is the basic respect we give one another. Will you Hate mongering monsters understand this #justasking https://t.co/vD1GhySf3M
— Prakash Raj (@prakashraaj) April 2, 2026
ఆ ఇంటర్వ్యూలోనే ప్రకాష్ రాజ్ తన వ్యక్తిగత విశ్వాసాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాను ‘నాస్తికుడుని’ అయినప్పటికీ, తన కుటుంబ సభ్యుల విశ్వాసాలను గౌరవించడం తన బాధ్యతగా భావిస్తానని పేర్కొన్నారు. తన భార్య పోనీ వర్మ హిందూ మతాన్ని, తన తల్లి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారని తెలిపారు. వారి నమ్మకాలపై ప్రశ్నించే హక్కు తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.
అలాగే, భార్య నిర్వహించే హోమాలు వంటి పూజా కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని, తల్లి కోరితే చర్చికి కూడా వెళ్తానని చెప్పారు. ఎవరి విశ్వాసాలు ఇతరులకు హాని చేయనంతవరకు వాటిని గౌరవించడం ముఖ్యమని ఆయన అప్పుడే వివరించారు.
తల్లి జీవితం – ఆరోగ్య సమస్యలు
ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. సువర్ణ లత రోమన్ కేథలిక్. ప్రకాష్ రాజ్ తండ్రి హిందువు. ఇలా ఒకే ఇంట్లో వైవిధ్య నేపథ్యాలు ఉన్నప్పటికీ ప్రకాష్ రాజ్ ఈ రెండు మతాల్లో ఏ మతం వైపూ అడుగు వేయలేదు. ఇంట్లో ఉన్న పరిస్థితులకు భిన్నంగా నాస్తికుడిగా మారారు. ఆయన దేవుడిని నమ్మరు.
ప్రకాష్ రాజ్ తల్లి సువర్ణ లత చిన్న వయసులోనే ఎన్నో కష్టనష్టాలను చవిచూసింది. అనాథగా పెరిగింది. హాస్పిటల్లో నర్సుగా పనిచేసింది. ఆ క్రమంలోనే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె జీవితంలో చాలా కష్టాలే పడింది. ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసింది. నర్సుగా ఉద్యోగం చేస్తూ ఇంటిల్లిపాదినీ ఆమెనే పోషించింది.
ప్రకాష్ రాజ్ లాంటి కొడుకు ఉండటం తన అదృష్టమని సువర్ణ లత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తనను తల్లిలా కాకుండా ఒక దేవతలా చూస్తాడని.. కన్న తల్లి కంటే ఏదీ ఎక్కువ కాదని ప్రకాష్ రాజ్ భావిస్తాడని.. తన కష్టాల్లో, బాధల్లో.. అన్నింటిలో తన బిడ్డ తనతో పాటే ఉన్నాడని ఆ ఇంటర్వ్యూలో సువర్ణ లత భావోద్వేగానికి లోనయ్యారు. ప్రకాష్ రాజ్కు కన్నతల్లితో అంతటి అనుబంధం ఉంది.