
చాలామంది రాత్రిపూట ఏం తినాలి అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. కానీ, ప్రముఖ డాక్టర్ ప్రకారం, మనం భోజనం చేసే సమయం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. రాత్రి 9 గంటలకు బదులు సాయంత్రం 7 గంటలకే భోజనం చేయడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని ఆయన చెబుతున్నారు…
ఎందుకు త్వరగా తినాలి
మన శరీరంలో ‘సర్కాడియన్ రిథమ్’ అనే ఒక సహజమైన గడియారం ఉంటుంది. ఇది మనం ఎప్పుడు నిద్రపోవాలి, ఆహారం ఎప్పుడు జీర్ణం కావాలి అనే విషయాలను కంట్రోల్ చేస్తుంది. మనం ఆలస్యంగా తిన్నప్పుడు, శరీరం ఒకవైపు నిద్రపోవడానికి సిద్ధమవుతుంది, మరోవైపు మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాల్సి వస్తుంది. ఈ రెండు పనులు ఒకేసారి చేయడం వల్ల శరీరంలోని వ్యవస్థలన్నీ తలకిందులై శరీరానికి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది.
ఆలస్యంగా భోజనం చేస్తే
మీరు రాత్రి 9:30 గంటలకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా సరే, మీ శరీరం దానిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. దీనివల్ల ఇన్సులిన్ పనితీరు తగ్గుతుంది. తిన్న ఆహారం శక్తిగా మారకుండా, 30-40 శాతం తక్కువగా ఉపయోగపడుతుంది. రాత్రిపూట జీవక్రియ (Metabolism) నెమ్మదించడం వల్ల కొవ్వు త్వరగా కరగకుండా పేరుకుపోతుంది. నిద్రకు సంబంధించిన ‘మెలటోనిన్’ హార్మోన్, జీర్ణక్రియ వల్ల సరిగ్గా విడుదల కాదు. రాత్రంతా నిద్రపోయినా, ఉదయం లేవగానే కడుపు ఉబ్బరంగా, ఒళ్లంతా బరువుగా, నీరసంగా అనిపిస్తుంది.
త్వరగా భోజనం చేయడం వల్ల
పరిశోధనల ప్రకారం, రాత్రి భోజనం త్వరగా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు 15 శాతం వరకు తక్కువగా, షుగర్ కంట్రోల్ ఉంటాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడంతో మంచి నిద్ర పడుతుంది. ఇన్సులిన్ సరిగ్గా పనిచేసి, కొవ్వు పెరగకుండా చేస్తుంది, బరువు కంట్రోల్లో ఉంటుంది .
ALSO READ : ప్రపంచాన్ని ఏలుతున్న మసాలా కింగ్
షుగర్, ఫ్యాటీ లివర్
డయాబెటిస్ లేదా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు రాత్రి ఆలస్యంగా తింటే, వారి రక్తంలో చక్కెర స్థాయిలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది వారి ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. కాబట్టి, రాత్రి 7-8 గంటలకల్లా భోజనం చేసేయడం మంచిది. మీరు పడుకోవడానికి కనీసం 2 నుండి 3 గంటల ముందే భోజనం చేసేయండి. సూర్యాస్తమయం అయ్యాక శరీరం నిద్రకు సిద్ధమవుతుంది కాబట్టి, ఆ లోపే ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు.