Reading Time: < 1 minute

రాష్ట్ర కాగ్ నివేదిక ప్రకారం రూ.3 లక్షల కోట్లకు పైగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం రూ.2.40 లక్షల కోట్లకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లెక్కలు చూపించిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ తెలిపారు. అంటే దాదాపు రూ.60 వేల కోట్లకు ఎలాంటి లెక్కలు చూపించబడలేదని, ఇది సుమారు 20 శాతమని తెలిపారు. అయితే ఈ రూ.60 వేల కోట్లు ఎటు వెళాయనేది ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పోరెడ్డి కిషోర్ మాట్లాడుతూ ఈ నిధులు ఆయా మంత్రిత్వ శాఖలకు పూర్తిగా పంపించబడ్డాయా? లేక పంపించిన తర్వాత పక్కకు మళ్లించబడ్డాయా? లేదా ఆర్థిక శాఖ నుంచే పూర్తిగా విడుదల కాలేదా? లేదా బడ్జెట్ విడుదల కాగానే 20 శాతం ముందుగానే పక్కకు పెట్టబడిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

ఇటీవల ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈ నిధులను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం మళ్లించిందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయని కిషోర్ పేర్కొన్నారు. మొత్తానికి ఈ డబ్బులు కొందరి జేబుల్లోకి వెళ్లాయా? లేదా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించబడ్డాయా? అనే చర్చ జరుగుతోందని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలు అయిపోగానే, ఈ బడ్జెట్లో మొదటి వాటా లేదా హక్కు తెలంగాణకు కాకుండా కేరళం కోసమే అన్న చందంగా అనిపిస్తోందని తెలిపారు. అందుకు నిదర్శనంగా ఈ బడ్జెట్ అయిపోగానే రేవంత్ రెడ్డి కేరళం ఎన్నికల ప్రచారానికి వెళ్లడమే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. మొదటి వాటా మాత్రం కేరళలోని కాంగ్రెస్ పార్టీకే అన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు.